Parliament Monsoon session : పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా
ABN , First Publish Date - 2023-07-20T15:09:26+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన గురువారం మణిపూర్ హింసాకాండ, అమానవీయ ఘటనలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన గురువారం మణిపూర్ హింసాకాండ, అమానవీయ ఘటనలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించిన ఈ సంఘటన దేశానికి అవమానకరమని, దోషులను వదిలిపెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాజ్యాంగాన్ని తూలనాడే ఈ ఘటనపై సత్వరమే చర్యలు చేపట్టకపోతే తాము రంగంలోకి దిగుతామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హెచ్చరించారు.
లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల దివంగతులైన సభ్యులకు నివాళులర్పించిన తర్వాత లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తూ, నినాదాలు చేశాయి. బీజేపీ నేత ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, సభా కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. సభ పునః ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై చర్చించాలని నినాదాలు చేశాయి. ఫలితంగా సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
జూన్‌లో కన్నుమూసిన సిట్టింగ్ ఎంపీ హరిద్వార్ దూబేకు రాజ్యసభ నివాళులర్పించింది. అనంతరం సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యులు లేచి సభా కార్యకలాపాలన్నిటినీ నిలిపేసి, మణిపూర్ హింసాకాండ గురించి చర్చించాలని పట్టుబట్టారు. ప్రధాని మోదీ సభకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
దేశానికి అవమానకరం : మోదీ
పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ గురువారం ఉదయం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ, మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు. ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు అని స్పష్టం చేశారు. ఇది దేశానికి అవమానకరమని చెప్పారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదన్నారు. ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు.
రాజ్యసభ ఉపాధ్యక్షుల ప్యానెల్‌లో సగం మంది మహిళలే
రాజ్యసభ ఉపాధ్యక్షుల ప్యానెల్‌ను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ప్రకటించారు. ఈ జాబితాలో 50 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఉపాధ్యక్షుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. బీజేపీ ఎంపీలు పీటీ ఉష, ఎస్ ఫంగ్నోన్ కొన్యక్, ఎన్‌సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్, బీజేడీ ఎంపీ సులత దేవి ఈ పదవులను పొందారు.
నవనీత్ రాణా ఆగ్రహం
మణిపూర్ ఘటనను స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ఖండించారు. మహిళలను అగౌరవపరచేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని దేశంలోని మహిళలు, పార్లమెంటులోని మహిళలు ప్రధాని మోదీని కోరుతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రాజీనామాకు ఒవైసీ డిమాండ్
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలన్నారు.
కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, మణిపూర్ పరిస్థితి గురించి సభలో చర్చించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ కోరారని చెప్పారు. ఆమె ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నపుడు ఆమె ఆయన ముందు ఈ డిమాండ్ పెట్టారని తెలిపారు.
పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజు నేతలు ఒకరినొకరు పలుకరించుకోవడం సంప్రదాయం. దీని ప్రకారం మోదీ అనేకమంది నేతలను పలుకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ వద్దకు వెళ్లి, ఆమె ఆరోగ్యం గురించి అడిగారు. ఆమె తన ఆరోగ్యం బాగుందని బదులిచ్చారు.
మణిపూర్ పరిస్థితి
మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ పరిస్థితిపై మాట్లాడకపోతే, పార్లమెంటులో అంతరాయాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ‘మన్ కీ బాత్ ఇక చాలునని, మణిపూర్ గురించి మాట్లాడవలసిన సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటులో మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తాము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్లపై మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. మోదీకి ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం ఉంది కానీ, మణిపూర్ వెళ్లడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ డెమొక్రసీని మొబొక్రసీగా మార్చిందని మండిపడ్డారు. మణిపూర్‌లో మానవత్వం చచ్చిపోయిందన్నారు. ‘‘నరేంద్ర మోదీ గారూ, మీ మౌనాన్ని ఇండియా ఎన్నటికీ క్షమించదు’’ అని హెచ్చరించారు.
మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తాం : మణిపూర్ సీఎం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (N Biren Singh) ఇచ్చిన ట్వీట్‌లో, సమాజంలో ఇటువంటి అమానుష చర్యలకు ఎంతమాత్రం చోటు లేదన్నారు. ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడిన వీడియోలో మనసును కలచివేసే దృశ్యాలు కనిపించాయన్నారు. అత్యంత అగౌరవప్రదమైన, అమానుష చర్యలకు గురైన బాధిత మహిళలకు సంఘీభావం తెలిపారు. ఈ వీడియో బయటపడిన వెంటనే మణిపూర్ పోలీసులు తక్షణ చర్యలు ప్రారంభించారని, గురువారం ఉదయం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని, దోషులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దోషులకు మరణ శిక్ష విధించే అంశాన్నికూడా పరిశీలిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. టీఎంసీ
Manipur : మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు.. చకచకా జరుగుతున్న కీలక పరిణామాలు..