Delhi Services Bill: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌షా, చర్చ ప్రారంభం..
ABN , First Publish Date - 2023-08-07T14:59:33+05:30 IST
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2003ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో సోమవారంనాడు ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీల ఆందోళనలు, సభా కార్యక్రమాల వాయిదాల మధ్య ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టడంతో వెంటనే చర్చ మొదలైంది.
న్యూఢిల్లీ: గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2003ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రాజ్యసభలో (Rajya sabha) సోమవారంనాడు ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీల ఆందోళనలు, సభా కార్యక్రమాల వాయిదాల మధ్య ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టడంతో వెంటనే చర్చ మొదలైంది.
ఢిల్లీ సీనియర్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానే ఈ బిల్లును అమిత్‌షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్డినెన్స్ బిల్లు ఇప్పటికే మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభలోనూ బిల్లు గెలిస్తే అది చట్టరూపం సంతరించుకుంటుంది.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలను కేంద్రం హస్తగతం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ బిల్లును కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోంది. రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును ఓడించాలంటూ ఆయన విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. బిల్లు రాజ్యసభకు వస్తున్న దృష్ట్యా 7,8 తేదీల్లో పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావలంటూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు విప్‌లు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ముందుకు సోమవారంనాడు ఆర్డినెన్స్ బిల్లు రావడం, వెంటనే చర్చ ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చ అనంతరం సాయంత్రం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.
ఎన్డీయే బలం..
కాగా, 238 సభ్యుల రాజ్యసభలో అధికార ఎన్డీయేకు 100 మంది ఎంపీల బలం ఉంది. తొమ్మిది మంది చొప్పున ఎంపీలున్న బీజేపీ, వైఎస్ఆర్‌సీపీలు ఇప్పటికే బిల్లుకు మద్దతు ప్రకటించాయి. నామినేటెడ్ సభ్యులు, కొందరు ఇండిపెండెట్లు కూడా బిల్లుకు మద్దతుగా నిలిచే వీలుంది. మరోవైపు, 26 విపక్ష పార్టీల ఇండియా (I.N.D.I.A.) కూటమి ఈ బిల్లును ఓడించగలమనే ఆశాభావంతో ఉంది.