Amul: పెద్ద వార్తే ఇది.. అమూల్ విక్రయాలకు బ్రేక్ ?
ABN , First Publish Date - 2023-04-12T11:42:33+05:30 IST
కర్ణాటక రాష్ట్ర మార్కెట్‌లో గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్‌కు అనుమతులు ఇవ్వడంపై ఇటు పాడి రైతుల్లోనూ, అటు ప్రతిపక్షాలు, కన్నడ సంఘాల్లోనూ..
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర మార్కెట్‌లో గుజరాత్‌కు (Gujarat) చెందిన అమూల్ బ్రాండ్‌కు (Amul Products) అనుమతులు ఇవ్వడంపై ఇటు పాడి రైతుల్లోనూ, అటు ప్రతిపక్షాలు, కన్నడ సంఘాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి రాజకీయం రూపం సంతరించుకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం తప్పదని భయపడుతున్న ప్రభుత్వం కనీసం ఎన్నికలయ్యేంత వరకైనా అమూల్ విక్రయాలకు బ్రేక్ వేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పార్టీ అధిష్టానం పెద్దల అనుమతితో ఈ బ్రేక్ వేసే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కానప్పటికీ కేఎంఎఫ్ వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ వివాదానికి తెరదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమూల్ రూపంలో ప్రతిపక్షాలకు కొత్త అస్త్రం లభించడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.