Annamalai: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. అనారోగ్యం కాదు.. అంతా నాటకమే!
ABN , First Publish Date - 2023-06-15T08:14:11+05:30 IST
ఈడీ అధికారుల విచారణ నుంచి తప్పించుకునేందుకు మంత్రి సెంథిల్‌బాలాజి అనారోగ్య నాటకమాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఈడీ అధికారుల విచారణ నుంచి తప్పించుకునేందుకు మంత్రి సెంథిల్‌బాలాజి అనారోగ్య నాటకమాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) చెప్పారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత ఎం.చక్రవర్తితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. సెంథిల్‌బాలాజీ అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలువురికి ఉద్యోగాలు తీసిస్తానంటూ అవినీతికి పాల్పడ్డారని, ఆ విషయమై సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే ఈడీ అధికారులు తమ విద్యుక్త ధర్మాన్ని స్వతంత్రంగా నిర్వహిస్తున్నారన్నారు. మారిషస్ సహా విదేశాలకు భారీ స్థాయిలో నగదు బట్వాడాలు జరిగాయిని కూడా ఆరోపణలున్నాయని, మంత్రి అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ కక్షసాధింపులు లేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్షసాధింపులకు పాల్పడాలనే ఉద్దేశమే లేదన్నారు. సెంథిల్‌బాలాజీ(Senthil Balaji)పై ఈడీ విచారణ జరిపి అరెస్టు చేస్తుందని ముందుగానే అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. కీలకమైన ఆధారాలు ఉన్నందువల్లే ఈడీ అధికారులు ఈ చర్యలు చేపడుతోందన్నారు. ఈ విచారణకు సహకరించకుండా మంత్రి సెంథిల్ బాలాజీ కపటనాటక మాడుతున్నారని ఆయన ఆరోపించారు.