Annamalai: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. రూ.5,600 కోట్ల కుంభకోణాలు జరిగాయి..

ABN , First Publish Date - 2023-07-27T08:31:48+05:30 IST

‘డీఎంకే ఫైల్స్‌-1’ పేరుతో గతంలో డీఎంకే నేతల ఆస్తుల జాబితా విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)...

Annamalai: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. రూ.5,600 కోట్ల కుంభకోణాలు జరిగాయి..

- ‘డీఎంకే ఫైల్స్‌-2’ విడుదల

- గవర్నర్‌కు అందించిన అన్నామలై

- రూ.5,600 కోట్ల కుంభకోణాలు జరిగాయంటూ ప్రకటన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘డీఎంకే ఫైల్స్‌-1’ పేరుతో గతంలో డీఎంకే నేతల ఆస్తుల జాబితా విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)... ఇప్పుడు ‘డీఎంకే ఫైల్స్‌-2’ పేరుతో ఓ జాబితాను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి అందించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌, న్యాయ విభాగ అధ్యక్షుడు ఆర్సీ పాల్‌ కనగరాజ్‌, సీనియర్‌ నేత కరాటే త్యాగరాజన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన అన్నామలై.. ‘డీఎంకే ఫైల్స్‌-2’(DMK Files-2) పేరుతో ఉన్న ఓ ట్రంకు పెట్టెను గవర్నర్‌ ముందుంచి... అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీఎంకే అధినేత కుటుంబీకులు బినామీల పేర్లతో రూ.5,600 కోట్ల మేర 3 కుంభకోణాలకు పాల్పడ్డారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వినతిపత్రం కూడా అందించారు. అనంతరం ఆయన సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు. ‘ఈటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌’లో రూ.3 వేల కోట్లు, ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో రూ.2 వేల కోట్లు, టీఎన్‌ఎంఎస్సీలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందని, వాటికి సంబంధించిన పత్రాలను కూడా గవర్నర్‌కు అందించామన్నారు. ఈ కుంభకోణాల్లో డీఎంకే నేతల హస్తముందని ప్రకటించారు. ఈ వివరాలను త్వరలో జరగబోయే తన పాదయాత్ర సందర్భంగా వివరిస్తానని వెల్లడించారు.

nani3.2.jpg

అందుబాటులో లేని వివరాలు.. : డీఎంకే ఫైల్స్‌-1 పేరుతో గత ఏప్రిల్‌ 14వ తేదీన ఓ జాబితా విడుదల చేసిన అన్నామలై.. అందులో డీఎంకే నేతల ఆస్తుల వివరాలు మాత్రం వెల్లడించారు. అప్పట్లో ‘అవినీతి జాబితా’ అంటూ హడావుడి చేసిన ఆయన.. కేవలం నేతల ఆస్తుల వివరాలు వెల్లడించడంతో ఆయన పార్టీ వర్గాలే దిగ్ర్భాంతి చెందాయి. ఇప్పుడు కూడా రూ.5,600 కోట్ల మేరకు మూడు కుంభకోణాలు జరిగాయంటూ ప్రకటించిన అన్నామలై.. అవినీతి ఎలా జరిగిందో చెప్పకపోవడంపై అన్ని వర్గాల నుంచి పెదవివిరుపులే కనిపించాయి. అయితే తన పాదయాత్ర సందర్భంగా వివరాలు వెల్లడిస్తానంటూ ఆయన చేసిన ప్రకటనతో .. అప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఉత్కంఠ డీఎంకే వర్గాల్లో నెలకొంది. ఇదిలా ఉండగా.. తొలి జాబితాలో అన్నాడీఎంకే నేతల ఆస్తుల వివరాలు కూడా వెల్లడించిన అన్నామలై .. ఈసారి మాత్రం వారి జోలికి పోలేదు.

Updated Date - 2023-07-27T08:31:49+05:30 IST