త్వరలో మంత్రివర్గంలో మార్పులు?! ఎనిమిదిమంది సీనియర్లపై వేటు!
ABN , First Publish Date - 2023-04-27T08:16:14+05:30 IST
త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయా?.. పనితీరు ప్రాతిపదికగా పలువురు సీనియర్లపై సీఎం వేటు వేయనున్నారా?..
చెన్నై, (ఆంధ్రజ్యోతి): త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయా?.. పనితీరు ప్రాతిపదికగా పలువురు సీనియర్లపై సీఎం వేటు వేయనున్నారా?.. పార్టీకి, మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి విధేయులుగా ఉన్న కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయవర్గాలు. సీఎం మే నెలాఖరులో విదేశాలకు పయనం కాక ముందే మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరిపై వేటు పడుతుందోనని మంత్రుల్లో గుబులు మొదలైంది.
పదేళ్ల తరువాత అధికారంలో కూర్చున్న డీఎంకే... 2021 మే 7న ప్రభుత్వ పగ్గాలు చేబూనిన విషయం తెలిసిందే. అంటే వచ్చే నెల 7వ తేదీ నాటికి ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాక ముందే గత సంవత్సరం మార్చిలో తొలిసారిగా మంత్రివర్గంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. నాడు మంత్రి రాజా కన్నప్పన్ వద్ద వున్న రవాణాశాఖను తొలగించి వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖను అప్పగించారు. ఆ శాఖలో వున్న శివశంకర్‌కు రవాణాశాఖను అప్పగించారు. రాజా కన్నప్పన్ పని తీరుతో అసంతృప్తి చెందిన సీఎం ఆయన్ని ఆ శాఖను బదిలీ చేశారు. అనంతరం గత డిసెంబరులో ట్రిప్లికేన్ ఎమ్మెల్యే, డీఎంకే యువజన విభాగ అధిపతి ఉదయనిధి(Udayanidhi)ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు క్రీడాభివృద్ధి, యువజన సంక్షేమం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలు శాఖలను అప్పగించారు. అదే విధంగా పదిమంది మంత్రుల శాఖల్ని కూడా మార్చారు. త్వరలోనే డీఎంకే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరును, సామర్థ్యాన్ని పరిశీలించిన సీఎం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు పరుగెత్తాలన్నా, శాఖల వారీగా పలు కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరాలన్నా ఔత్సాహికులైన సమర్థవంతమైన మంత్రులు ఉండాలని సీఎం యోచిస్తున్నారు. ఆ ఎన్నికలను ఏమాత్రం అలక్ష్యం చేసినా, ప్రతిపక్ష అన్నాడీఎంకేకు తగినన్ని సీట్లు వచ్చేందుకు అవకాశం కల్పించినా, మునుముందు తమ పార్టీ కష్టపడాల్సి ఉంటుందని సీఎం భావిస్తున్నారు. అందుకే ప్రతిపక్షం కోలుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించి కిందిస్థాయిలోనూ పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయగలిగే వ్యక్తులు మంత్రివర్గంలో ఉండాలని స్టాలిన్(Stalin) యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు సీనియర్ మంత్రులను తన టీం నుంచి తొలగించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. శాఖల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమర్థనీయంగా నిర్వహించలేకపోవడం, అధిష్ఠానాన్ని పట్టించుకోకపోవడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేర్పులు వుండవచ్చని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
ఆ మేరకు పళనివేల్ త్యాగరాజన్, కన్నప్పన్, గాంధీ, నాజర్, రఘుపతి, గణేశన్, కయల్విళి తదితరులను మంత్రివర్గం నుంచి తొలగించవచ్చని ప్రచారం జరుగుతోంది. వీరి స్థానాల్లో డీఆర్‌పీ రాజా, కేవీ చెళియన్, డాక్టర్ ఎళిలన్, అబ్దుల్ వహాబ్, తమిళరసి, ముత్తు రామలింగం, రాజేంద్రన్ తదితరులను తీసుకునే అవకాశమున్నట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇందులో అధికులు ఉదయనిధి సన్నిహితులని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే విధంగా మంత్రుల్లో ఐ.పెరియస్వామి, ముత్తుస్వామి, కేకేఎ్‌సఎస్ఆర్ రామచంద్రన్, ఎం.సుబ్రమణ్యం(M. Subramaniam), మహేష్ తదితరుల శాఖల్లో మార్పు జరగవచ్చని చెబుతున్నాయి. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు సింగపూర్, జపాన్, మలేసియా వంటి దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. వచ్చే నెల 2వ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే విధంగా ముఖ్యమంత్రి ఆరోగ్య పరీక్షల కోసం మే 20వ తేదీన లండన్ వెళ్లనున్నారు. అయితే ఈలోపే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం గట్టిగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనికంటే ముందుగా సీఎం తన కుటుంబంతో కలిసి రెండు రోజుల పాటు మహాబలిపురంలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి రాగానే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశముందని డీఎంకేలోని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి.