Arvind Kejriwal: నేడు చెన్నైకి కేజ్రీవాల్
ABN , First Publish Date - 2023-06-01T08:02:50+05:30 IST
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరించేలా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై పోరు సాగిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)..
- సీఎంతో భేటీ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరించేలా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై పోరు సాగిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. అందుకు మద్దతు కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)తో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై రానున్నారు. ఆయనతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా వచ్చే అవకాశముందని తెలిసింది. దేశ రాజధాని ఢిల్లీలో గ్రూప్-ఎ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యల విషయంలో కేంద్రప్రభుత్వం గత మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానికంటే ముందే ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై సర్వాధికారాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును నీరుగార్చేందుకే కేంద్రప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని మండిపడుతున్న కేజ్రీవాల్.. ఆ తీర్పు అమలయ్యేందుకు సహకరించాలంటూ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee), మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులను కలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా సీఎం స్టాలిన్‌తో భేటీ కానున్నారు. నిజానికి కేజ్రీవాల్-స్టాలిన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో స్టాలిన్ ఢిల్లీ వెళ్లి అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ తరగతులను పరిశీలించి రావడంతో పాటు ఇక్కడా అమలు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లోనూ ఇద్దరు నేతలు పలు అంశాలపై ఏకాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ చనువు వల్లే కేజ్రీవాల్... స్టాలిన్ మద్దతు కోరేందుకు చెన్నై వస్తున్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.