Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైతే.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారు
ABN , First Publish Date - 2023-11-06T22:41:41+05:30 IST
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేస్తే.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన తరుణంలో..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేస్తే.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన తరుణంలో.. ఆప్ ఈ వ్యాఖ్యలు చేసింది. సోమవారం ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ జరిపిన సమావేశంలో భాగంగా.. ఈడీ అరెస్ట్ చేసినా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని ఆయన్ను నేతలు కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవికి రాజీనామా చేయొద్దని చెప్పారు. కేజ్రీవాల్‌ని జైలులో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆప్ ఆరోపించింది.
‘‘మేము ప్రజల మధ్య వెళ్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీపై, అరవింద్ కేజ్రీవాల్‌పై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. అందుకే.. కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా, సీఎం పదవికి రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రిగానే కొనసాగాలని ఎమ్మెల్యేలంతా ఆయన్ను అభ్యర్థించారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి.. ఆయనే సీఎంగా ఉండాలి’’ అని ఢిల్లీ మంత్రి అతిశి మార్లేనా పేర్కొన్నారు. జైలులోనే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకు కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతేకాదు.. త్వరలో కేజ్రీవాల్ పార్టీ కౌన్సిలర్లతో కూడా సమావేశం కానున్నట్లు సౌరభ్ భరద్వాజ్, అతిశి స్పష్టం చేశారు.
కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ నవంబర్ 2వ తేదీన కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. అయితే.. ఈ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. తనకు జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమైనవి, రాజకీయంగా ప్రేరేపించబడినవని ఆయన ఆరోపించారు. బీజేపీ అభ్యర్థన మేరకే ఈ సమన్లు పంపినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. అంతకుముందు.. ఏప్రిల్‌లో ఇదే లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ దర్యాప్తు చేసింది. ఆయన్ను తొమ్మిది గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. కానీ.. ఈడీ విచారణకు మాత్రం గైర్హాజరయ్యారు.
మరోవైపు.. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపించడంపై ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. ఇందుకోసం వాళ్లు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, తప్పుడు కేసులు కూడా సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ కుట్రలో భాగంగానే.. కేజ్రీవాల్‌ను జైలుకు పంపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ కేసుల్లో తమ నేతల్ని క్రమపద్ధతిలో అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా ఆప్‌ని నాశనం చేసేందుకు బీజేపీ పూనుకుందని వ్యాఖ్యానించారు.