Delhi Liquor Policy: సౌత్‌గ్రూపు నిర్దేశించినట్లుగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ
ABN , First Publish Date - 2023-03-22T02:35:03+05:30 IST
సౌత్‌గ్రూ్‌ప నిర్దేశించినట్లుగానే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపుదిద్దుకుందని సీబీఐ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ విచారణ జరిపారు.
ఫోన్లే కాదు.. ఫైళ్లనూ ధ్వంసం చేశారు..
రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ వాదనలు
నా భార్య ఆరోగ్యం బాగోలేదు
కుమారుడు విదేశాల్లో ఉన్నాడు
దయచేసి బెయిల్ ఇవ్వండి: సిసోడియా
మద్యం విధానంపై ప్రజలు ఫిర్యాదు చేశారా?
సిసోడియాకు అందిన ముడుపులెంత??
సీబీఐని ప్రశ్నించిన న్యాయమూర్తి నాగ్‌పాల్
సిసోడియా ఓ సన్యాసి.. సీబీఐ న్యాయవాది
తప్పుబట్టిన సిసోడియా తరఫు న్యాయవాదులు
న్యూఢిల్లీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సౌత్‌గ్రూ్‌ప నిర్దేశించినట్లుగానే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపుదిద్దుకుందని సీబీఐ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ విచారణ జరిపారు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని సిసోడియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని, తన కుమారుడు విదేశాల్లో ఉన్నాడని, దయచేసి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సీబీఐ తరఫున న్యాయవాది డీపీ సింగ్ వాదనలు వినిపిస్తూ.. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో సౌత్‌గ్రూ్‌పనకు చెందిన సభ్యులు చార్టెర్డ్ విమానంలో ఢిల్లీకి వచ్చారని వివరించారు. బ్లాక్‌లిస్టులో ఉన్న ఇండోస్పిరిట్ కంపెనీకి లైసెన్సులు మంజూరు చేసేలా అధికారులపై సిసోడియా ఒత్తిడి చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ‘‘మద్యం విధానంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ‘‘మద్యం తక్కువ ధరకు లభిస్తే ప్రజలకు అంతకు మించి ఏం కావాలి?’’ అని డీపీ సింగ్ బదులిచ్చారు. ‘‘మీ ప్రకారం సిసోడియా ఎంత మేర ముడుపులు స్వీకరించారు?’’ అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు డీపీ సింగ్ స్పందిస్తూ.. దాదాపు రూ.100 కోట్లు అని తెలిపారు.
ఇక్కడ డబ్బు ముఖ్యంకాదని, విధానంలో అనేక అంశాలను మార్చారని చెప్పారు. సౌత్ గ్రూపునకు చెందిన సభ్యులు ఢిల్లీ వచ్చి ఒబెరాయ్ హోటల్‌లో బస చేశారని, అక్కడ విధానంలో మార్పులు చేశారని పేర్కొన్నారు. సిసోడియా తరఫున న్యాయవాది దయన్ కృష్ణన్ వాదిస్తూ.. తన క్లైంట్ సాక్షులను ప్రభావితం చేస్తారనడానికి, ముడుపులు స్వీకరించినట్లు డాక్యుమెంటరీ పరమైన ఆధారాలు లేవన్నారు. ఇది ప్రభుత్వ విధానమని, ప్రభుత్వాలు చేసే పాలసీలకు నేరపూరిత ఉద్ధేశాలను ఆపాదించరాదని, ఈ పాలసీని లెఫ్ట్‌నెంట్ గవర్నర్, న్యాయశాఖ కార్యదర్శి కూడా ఆమోదించారని గుర్తుచేశారు.
ఫైళ్లనూ ధ్వంసం చేశారు
సిసోడియాకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేయడంతోపాటు.. సాక్షులను బెదిరించే ప్రమాదముందని డీపీ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. సిసోడియా మొబైల్ ఫోన్లను మాత్రమే కాకుండా.. ఫైళ్లను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు. ‘‘అప్‌గ్రేడ్ అవ్వాలన్న కారణంతో ఫోన్లను ధ్వంసం చేశానని సిసోడియా చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం. ఐఫోన్ మూణ్నెల్లలో ఎలా ఔట్‌డేట్ అవుతుంది?’’ అని ప్రశ్నించారు. అక్రమాలు బయటపడే వరకు ఆయన ఒక సన్యాసి అని డీపీ సింగ్ వ్యాఖ్యానించగా.. ఆ వ్యాఖ్యలను సిసోడియా తరఫున న్యాయవాదులు తప్పుబట్టారు. కాగా, డీపీ సింగ్ తన వాదనలను కొనసాగిస్తూ.. ‘‘తొలుత మద్యం విధానంపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారి రవి ధవన్‌కు ఎక్సైజ్ మంత్రి హోదాలో సిసోడియా సూచించారు.
నివేదికలో రవి ధవన్ మూడు పద్ధతులను ప్రతిపాదించారు. ఒకటి: ప్రస్తుతం ఉన్నదాన్ని కొనసాగించడం(ప్రభుత్వం ఆజమాయిషీ). రెండోది: ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు జారీ చేయడం. మూడోది: మద్యం దుకాణాలను ప్రైవేటీకరించి, ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం. ఈ నివేదిక మంత్రికి నచ్చలేదు. దాంతో రవిని తొలగించి ఆ స్థానంలో రాహుల్ సింగ్‌ను నియమించారు. ఆ తర్వాత మద్యం విధానం నివేదికపై సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయాలను కూడా తీసుకున్నారు’’ అని వివరించారు. వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి, తదుపరి విచారణను 24కు వాయిదా వేశారు.