Asaduddin Owaisi: ఒవైసీ వ్యాఖ్యలతో మళ్లీ దుమారం

ABN , First Publish Date - 2023-04-21T16:28:07+05:30 IST

అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌, (Atiq Ahmed) అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ హత్యలపై మళ్లీ మాట్లాడారు.

Asaduddin Owaisi: ఒవైసీ వ్యాఖ్యలతో మళ్లీ దుమారం
Asaduddin Owaisi latest comments on Atiq Ashraf killing,

పాట్నా, ప్రయాగ్‌రాజ్, హైదరాబాద్: రంజాన్ (Ramzan) మాసం చివరి శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఎంఐఎం అధినేత (AIMIM chief) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌, (Atiq Ahmed) అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ హత్యలపై మళ్లీ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) అతీఖ్, అష్రఫ్‌ను హత్య చేసేందుకు హంతకులకు ఆటోమాటిక్ ఆయుధాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. లక్షల ఖరీదైన పిస్టళ్లను ఎవరిచ్చారని ఒవైసీ ప్రశ్నించారు. హంతకులు మరింతమందిని చంపే అవకాశం ఉందని, అలాంటి ఉగ్ర మనస్తత్వం ఉన్న వాళ్లపై యూఏపిఏ యాక్ట్ (Unlawful Activities (Prevention) Act) ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ చెప్పారు.

మరోవైపు బీహార్ రాజధాని పాట్నాలో చివరి శుక్రవారం ప్రార్ధనల అనంతరం గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌ అమర్ హై అంటూ కొందరు నినాదాలు చేశారు.

అటు ప్రయాగ్ రాజ్‌లో మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేశారు.

మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వెలెన్స్‌లో ఉన్న వెయ్యి ఫోన్ నెంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. వీటిలో చాలా నెంబర్లు ఆఫ్ ఉండటాన్ని పోలీసులు గమనించారు. హంతకులు బస చేసిన హోటల్ వద్ద సిట్ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పటికే సిట్ తాత్కాలిక నివేదిక ఆధారంగా అశ్వనీ కుమార్ సింగ్‌ను, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్‌లను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

ఇటు అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను కాల్చి చంపిన లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య ప్రాణాలకు ముప్పుందని, వారిపై దాడి జరిగే అవకాశముందని పోలీసులకు నిఘావర్గాల నుంచి సమాచారం అందిందని తెలిసింది. దీంతో వారి భద్రతను కట్టుదిట్టం చేశారు. హంతకులు ప్రస్తుతం పోలీస్ లైన్‌లో ఉన్నారు.

ఈ నెల 15న అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని కెల్విన్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా.. లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య మెడలో మీడియా ఐడీ కార్డులు ధరించి, అక్కడకు చేరుకున్నారు. దుండగుల్లో ఒకడు అతీక్‌ కణతపై రివాల్వర్‌ను పెట్టి, ట్రిగ్గర్‌ నొక్కేశాడు. అతీక్‌ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే దుండగులు అష్రాఫ్‌ వైపు వచ్చి.. అతణ్నీ కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా.. కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులను కొనసాగించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ ముగ్గురూ తమకు అతీక్‌తో ఉన్న పాతకక్షల వల్లే ఆ ఘాతుకానికి పాల్పడ్డట్లు అంగీకరించినట్లు తెలిసింది. అంతే కాదు ఈ హత్య ద్వారా మాఫియాలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడం కూడా లక్ష్యమని విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇతర సమయాల్లో అతీక్‌ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం కష్టమని, పోలీసులు వారిద్దరినీ జైలుకు తరలిస్తే మళ్లీ చాన్స్‌ దొరకదని చెప్పిట్లు సమాచారం. అందుకే మీడియా ముసుగులో అతీక్‌కు అతి సమీపానికి వచ్చాక.. ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టర్కీలో తయారైన అత్యాధునిక పిస్టళ్లను హంతకులు వాడారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్కో పిస్టల్ ఖరీదు 8 లక్షల వరకూ ఉంటుందని అంచనా.

Updated Date - 2023-04-21T16:35:43+05:30 IST