Congress Vs BJP : మహిళలపై నేరాలను బయటపెట్టినందుకే మంత్రిని తొలగించారు.. రాజస్థాన్ సీఎంపై బీజేపీ ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-07-22T11:08:24+05:30 IST

రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలను వేలెత్తి చూపినందుకే రాజేంద్ర సింగ్ గుధాను మంత్రి పదవి నుంచి తొలగించారని బీజేపీ ఆరోపించింది. వాస్తవం మాట్లాడినందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ చర్య తీసుకున్నారని మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ, ఆ పార్టీ నేత, మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్‌ను ప్రశంసల్లో ముంచెత్తింది.

Congress Vs BJP : మహిళలపై నేరాలను బయటపెట్టినందుకే మంత్రిని తొలగించారు.. రాజస్థాన్ సీఎంపై బీజేపీ ఆగ్రహం..
Rajendra Singh , Ashok Gehlot

జోధ్‌పూర్ : రాజస్థాన్‌ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల గురించి శాసన సభలో ప్రస్తావించిన రాజేంద్ర సింగ్ గుధాను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. వాస్తవం మాట్లాడినందుకు రాజేంద్రను మంత్రి పదవి నుంచి తొలగించారని మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ, ఆ పార్టీ నేత, మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్‌ను ప్రశంసల్లో ముంచెత్తింది.

కాంగ్రెస్ నేత, మంత్రి రాజేంద్ర సింగ్ (Rajendra Singh Gudha) శుక్రవారం రాజస్థాన్ (Rajastan) శాసన సభలో మాట్లాడుతూ తన సొంత ప్రభుత్వాన్నే దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇటీవల మహిళలపై జరిగిన నేరాలను ప్రస్తావించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ విషయాన్ని అంగీకరించవలసిందేనని చెప్పారు. మణిపూర్‌‌లో పరిస్థితుల గురించి మాట్లాడటానికి బదులుగా, మనం ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పారు. రాజస్థాన్‌లో మహిళలపై దురాగతాలు, నేరాలు ఎందుకు పెరిగిపోతున్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

దీంతో కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాజేంద్ర సింగ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు శుక్రవారం సిఫారసు చేశారు. ఈ సిఫారసును గవర్నర్ వెంటనే ఆమోదించారు.

రాజేంద్ర స్పందన

మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ, తాను ఎల్లప్పుడూ వాస్తవాలనే మాట్లాడతానని చెప్పారు. అంతరాత్మ ప్రబోధం మేరకే తాను మాట్లాడతానన్నారు. సత్యం మాట్లాడినందుకు తనకు శిక్ష పడిందన్నారు.

బీజేపీ ఆగ్రహం

రాజేంద్ర సింగ్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ, రాజేంద్ర సింగ్‌ను ప్రశంసించారు. ఆయన ధైర్యసాహసాలతో వాస్తవాలను మాట్లాడారన్నారు. కానీ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించలేకపోతోందన్నారు. గెహ్లాట్ తన చర్య ద్వారా రాజస్థాన్‌లో మహిళలు, వ్యక్తులు మాత్రమే కాదు, రాష్ట్రంలో మహిళలపై దురాగతాలకు వ్యతిరేకంగా గళం వినిపించే మంత్రికి కూడా రక్షణ లేదని ఓ ముద్ర వేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మడెర్నాపై కూడా చర్యలు తీసుకుంటారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ (BJP) నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ సత్యాన్ని సహించలేదని ఆరోపించారు. రాజస్థాన్ శాసన సభలో మంత్రి రాజేంద్ర సింగ్ గుధా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల గురించి బయటపెట్టారని, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలపై విమర్శలు చేయడానికి బదులుగా, రాజస్థాన్‌లో జరుగుతున్న నేరాలపై దృష్టిపెట్టాలని చెప్పారని గుర్తు చేశారు. మూడేళ్ళ నుంచి మహిళలపై నేరాల్లో రాజస్థాన్ అగ్ర స్థానంలో ఉంటోందన్నారు. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రాజేంద్ర సింగ్ పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చెప్పారని, మహిళలపై నేరాల గురించి, మహిళలకు భద్రత కల్పించడం గురించి మాట్లాడటం కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. దీనినిబట్టి పార్టీయే ముఖ్యమని, దేశం ప్రధానం కాదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.

ఇవి కూడా చదవండి :

HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Updated Date - 2023-07-22T11:08:24+05:30 IST