Atiq Ahmed Murder : అతిక్ సోదరుల హత్యతో వెలుగు చూసిన మరో దారుణం.. కారును ఓవర్‌టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన గ్యాంగ్‌స్టర్..
ABN , First Publish Date - 2023-05-03T18:06:37+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల హత్యకు గురైన అతిక్ అహ్మద్, అష్రఫ్ సోదరుల దారుణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల హత్యకు గురైన అతిక్ అహ్మద్, అష్రఫ్ సోదరుల దారుణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. 44 ఏళ్లపాటు ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల జిల్లాల ప్రజలను ఈ సోదరులు భయభ్రాంతులకు గురి చేశారు. ఏప్రిల్ 15న వీరిద్దరి మరణంతో వీరి బాధితులు మౌనాన్ని వీడి, తమకు జరిగిన నష్టాన్ని చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు.
మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం ఓ వాహనాన్ని మరో వాహనం సురక్షితంగా ఓవర్‌టేక్ చేయవచ్చు. కానీ అతిక్, అష్రఫ్ నిర్వహించే కోర్టులో ఇది తీవ్రమైన నేరం. అది ఎంత పెద్ద నేరమంటే మరణ శిక్ష విధించదగినంత నేరం.
ప్రయాగ్‌రాజ్‌లోని కర్బల పోలీస్ చౌకీ ఎదురుగా ఓ చిన్న దుకాణాన్ని నడుపుతున్న విజయ్ కుమార్ సాహు 1996 నుంచి తనలోనే దాచుకున్న ఆవేదనను ఇప్పుడిప్పుడే బయటకు చెప్పగలుగుతున్నారు. జీవితాంతం వెంటాడే సంఘటనలు కొన్ని ఉంటాయని ఆయన చెప్తూ ఉంటే, వినేవారి కళ్లు చెమర్చక మానవు. 1996 జనవరిలో తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి చకియా ప్రాంతంలోని ఓ శ్మశాన వాటికకు వెళ్లామని విజయ్ కుమార్ చెప్పారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నపుడు, ఓ కారును తన సోదరుడు అశోక్ కుమార్ సాహు ఓవర్‌టేక్ చేసినట్లు తెలిపారు. ఆ కారు అతిక్ సోదరుడు అష్రఫ్‌కు చెందినదని తమకు తెలియదన్నారు.
కారును ఓవర్‌టేక్ చేసిన తర్వాత అష్రఫ్ వేగంగా వచ్చి, తమను అడ్డుకున్నాడని, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించాడని చెప్పారు. ఈ ఘర్షణను చూసిన స్థానికులు అక్కడికి వచ్చి, పరిస్థితి సద్దుమణిగేలా చేశారన్నారు. అనంతరం తాము తమ గ్రామానికి వెళ్లిపోయామన్నారు.
కొద్ది రోజుల తర్వాత తమ కుటుంబానికి ఓ సందేశం వచ్చిందన్నారు. అతిక్ తన కోర్టుకు తమను హాజరుకావాలని ఆదేశించినట్లు ఆ సందేశంలో ఉందన్నారు. అతిక్ కార్యాలయంలోనే ఈ కోర్టు జరుగుతుందని చెప్పారు. తాను తన తల్లిని తీసుకుని అతిక్ కార్యాలయానికి వెళ్లానని, పొరపాటు జరిగిందని తాము చాలాసార్లు చెప్పామని తెలిపారు. అది అష్రఫ్ కారు అని తమకు తెలియదని అనేకసార్లు చెప్పామన్నారు. కానీ అతిక్ ఊరుకోలేదని, ‘నువ్వు తప్పు చేశావు’ అని గద్దించాడని చెప్పారు. ‘‘నేను చకియా ప్రాంతానికి చెందినవాడినని నీకు తెలియదా? నువ్వు తప్పు చేశావు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడన్నారు. నన్ను, నా సోదరుడిని క్షమించమని పదే పదే ప్రాథేయపడ్డానని అయినప్పటికీ వినకుండా, ‘నువ్వు చాలా తప్పు చేశావు’ అని అనేవాడని చెప్పారు.
1996 జనవరి 19న తన సోదరుడు అశోక్ (24) తమ బంధువును చూడటానికి ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడ అష్రఫ్, అతని ముఠా కలిసి తన సోదరుడిని కాల్చి చంపేశారని చెప్పారు.
తమ కుటుంబం ఈ బాధను, దుఃఖాన్ని 27 సంవత్సరాలపాటు దిగమింగుకుని బతుకుతున్నామని చెప్పారు. అతిక్, అష్రఫ్ హత్యకు గురైనట్లు తెలుసుకున్న తర్వాత తమ ఆవేదనను చెప్పుకోగలుగుతున్నామని తెలిపారు.
వందకుపైగా కేసులు.. ముగ్గురి కాల్పుల్లో హతం..
అతిక్, అష్రఫ్ సోదరులపై వందకుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కస్టడీలో ఉన్న వీరిద్దరినీ వైద్య పరీక్షల కోసం పోలీసులు ఏప్రిల్ 15న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ముగ్గురు దుండగులు వీరిపై కాల్పులు జరిపి, హత్య చేశారు. తాము జర్నలిస్టులమని చెప్పుకుని ఆ దుండగులు అక్కడికి వచ్చారు. కాల్పులు జరిపినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు
Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..