Attacks on Hindu Temples: హిందూ దేవాలయాలపై దాడులు... ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్పందన...

ABN , First Publish Date - 2023-03-11T16:52:18+05:30 IST

మతపరమైన కట్టడాలు, భవనాలపై తీవ్రవాద చర్యలను ఆస్ట్రేలియా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్

Attacks on Hindu Temples: హిందూ దేవాలయాలపై దాడులు... ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్పందన...
Anthony Albanese, Narendra Modi

న్యూఢిల్లీ : మతపరమైన కట్టడాలు, భవనాలపై తీవ్రవాద చర్యలను ఆస్ట్రేలియా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ( Anthony Albanese) స్పష్టం చేశారు. హిందూ దేవాలయాలపై ఇటువంటి చర్యలకు స్థానం లేదన్నారు. మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా స్పందించారని శనివారం విడుదలైన అధికారిక ప్రకటన పేర్కొంది. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనతో మాట్లాడుతూ, ఆస్ట్రేలియా (Australia)లోని హిందూ దేవాలయాల (Hindu Temples)పై జరుగుతున్న దాడుల వల్ల భారత దేశం (India)లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు.

హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో మోదీకి ఇచ్చిన హమీ గురించి మీడియా అడిగిన ప్రశ్నపై ఆంథోనీ అల్బనీస్ స్పందిస్తూ, ‘‘ప్రజల మత విశ్వాసాలను గౌరవించే దేశం ఆస్ట్రేలియా అని నేను ఆయనకు హామీ ఇచ్చాను. మతపరమైన భవనాలపై, అవి హిందూ దేవాలయాలు, మసీదులు, సినగాగ్స్, లేదా, చర్చిలు అయినప్పటికీ, మనం చూస్తున్న తీవ్రవాద చర్యలు, దాడులను మేం సహించబోమని చెప్పాను’’ అని తెలిపారు. ఇటువంటి దాడులకు పాల్పడేవారిపై భద్రతా సంస్థలు, పోలీసుల ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని చెప్పానని తెలిపారు. తమది సహనంతో కూడిన బహుళ సంస్కృతులుగల దేశమని తెలిపారు. ఇటువంటి చర్యలకు ఆస్ట్రేలియాలో స్థానం లేదన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతకుముందు మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని భారత సంతతి ప్రజల భద్రత, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, దీనికే తాను ప్రాధాన్యమిస్తానని చెప్పారని తెలిపారు. కొన్ని వారాల నుంచి ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడుల వార్తలు ప్రతి నిత్యం వస్తున్నాయన్నారు. అటువంటి వార్తలు భారత దేశంలోని ప్రజలకు ఆందోళన కలిగించడం సహజమని చెప్పారు. ప్రధాన మంత్రి అల్బనీస్‌కు ఈ విషయం చెప్పానని తెలిపారు. అందుకు ఆయన స్పందిస్తూ, ఇండియన్ కమ్యూనిటీ భద్రత తనకు ప్రత్యేక ప్రాధాన్యతాంశమని హామీ ఇచ్చారని తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ అనుకూలవాదులు (Pro Khalistan) హిందూ దేవాలయాలపై తరచూ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారంలో బ్రిస్బేన్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంపై దాడి చేశారు.

మోదీ, అల్బనీస్ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శుక్రవారం చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరికల్లా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడంపై కూడా మాట్లాడారు.

ఇవి కూడా చదవండి :

CBI Vs RJD : తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు... సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు...

Infosys Vs Tech Mahindra: ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఉద్యోగులకు బిగ్ న్యూసే ఇది!

Updated Date - 2023-03-11T16:52:18+05:30 IST