Ayodhya Ramalayam : రామాలయం నిర్మాణంలో మరో కీలక ఘట్టం... అగ్ర శ్రేణి శిల్పులకు ఆహ్వానం...

ABN , First Publish Date - 2023-01-06T14:18:06+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం (Ayodhya Ram Mandir) నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది.

Ayodhya Ramalayam : రామాలయం నిర్మాణంలో మరో కీలక ఘట్టం... అగ్ర శ్రేణి శిల్పులకు ఆహ్వానం...
Ayodhya Ram Temple

అయోధ్య : ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం (Ayodhya Ram Mandir) నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయించేందుకు నమూనాలను పంపించాలని దేశంలోని సుప్రసిద్ధ శిల్పులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Tirath Kshetra Trust) కోరింది. ఈ నమూనాల నుంచి ఒకదానిని ఎంపిక చేసి, విగ్రహాన్ని తయారు చేయించి రామాలయంలో ప్రతిష్ఠిస్తామని తెలిపింది.

ట్రస్ట్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సుప్రసిద్ధ శిల్పులు కొందరు శ్రీరాముని విగ్రహ నమూనాలను పంపిస్తారు. ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూ, వాసుదేవ్ కామత్, కర్ణాటకకు చెందిన కేవీ మనియా, పుణేకు చెందిన శస్త్రయజ్య దెవుల్కర్ కూడా శ్రీరాముని విగ్రహ నమూనాలను పంపిస్తారు. 9 అంగుళాల నుంచి 12 అంగుళాల ఎత్తు ఉండే నమూనాలను పంపించనున్నారు.

ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ, రామ్ లల్లా (Ram Lalla) విగ్రహాన్ని తయారు చేసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన శిలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రామ్ లల్లా విగ్రహ నమూనాను ఖరారు చేసిన తర్వాత ఈ శిలలకు ట్రస్ట్ ఆమోదం తెలుపుతుందని చెప్పారు. విగ్రహంపై సూర్య కిరణాలు పడే విధంగా 8.5 అడుగుల నుంచి 9 అడుగుల ఎత్తులో రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయిస్తామన్నారు.

రామాలయం గర్భ గుడిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు దేశంలోని సుప్రసిద్ధ వాస్తు కళ, భవన నిర్మాణ రంగంలో నిపుణులను, అగ్ర శ్రేణి సంస్థలను ఈ ట్రస్ట్ ఆహ్వానించింది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమినాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని నుదుటిపై సూర్య కిరణాలు పడే విధంగా గర్భ గుడిని నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం రూర్కీలోని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ, పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ , సుప్రసిద్ధ దేవాలయ వాస్తు శిల్పులను నియమించింది.

Updated Date - 2023-01-06T14:18:10+05:30 IST