Bangalore: ఐటీ నగరి నుంచి జంట నగరాలకు.. రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు

ABN , First Publish Date - 2023-06-28T13:46:23+05:30 IST

రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు(Vande Bharat train) వచ్చింది. దేశవ్యాప్తంగా ఐదు వందేభారత్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేం

Bangalore: ఐటీ నగరి నుంచి జంట నగరాలకు.. రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు(Vande Bharat train) వచ్చింది. దేశవ్యాప్తంగా ఐదు వందేభారత్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలో జంట నగరాలైన హుబ్బళ్లి-ధారవాడ నుంచి రాజధాని బెంగళూరుకు వందేభారత్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. ధారవాడ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వర్చువల్‌ రూపంలో ప్రారంభించడాన్ని స్థానికులు, రైల్వే అధికారులు వీక్షించారు. బెంగళూరు - హుబ్బళ్లి- ధారవాడ మధ్య సంచరించేందుకు వందేభారత్‌ అత్యంత అనుకూలమైనదిగా మారింది. ప్రారంభంలో ధారవాడ నుంచి హుబ్బళ్లి దాకా గవర్నర్‌, కేంద్రమంత్రి ప్రయాణించారు. బెంగళూరు మెజస్టిక్‌ నుంచి ఉదయం 5.45 గంటలకు బయల్దేరే వందేభారత్‌ మధ్యాహ్నం 12.10 గంటలకు ధారవాడకు చేరుకోనుంది. మధ్యాహ్నం 1.15 కు ధారవాడ నుంచి బయల్దేరి రాత్రి 7.45కు బెంగళూరు మెజస్టిక్‌కు రానుంది. వారంలో ఆరు రోజులు సంచరించనుంది. బెంగళూరు నుంచి ధారవాడకు ప్రయాణించేందుకు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రూ.2265, ఏసీ చెయిర్‌లో రూ.1165 కాగా, ధారవాడ నుంచి బెంగళూరుకు వచ్చేందుకు ఎగ్జిక్యూటివ్‌లో రూ.2460, ఏసీ చెయిర్‌లో రూ.1330గా ఉంది. వందేభారత్‌ ప్రారంభం సందర్భంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ ధారవాడ ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్‌ వచ్చేసిందన్నారు. రెండు నగరాల మధ్య సంచారం అధికమని, సుదూరం కావడంతో ఎక్కువ సమయం ప్రయాణానికి కేటాయించాల్సి ఉండేదన్నారు. కేంద్రప్రభుత్వం మహత్తరమైన పథకంలో వందేభారత్‌ ఒకటని కొనియాడారు. ఇకపై బెంగళూరుకు సులభతరంగా ప్రయాణించేందుకు వీలుందన్నారు. ఉత్తర కర్ణాటక నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ఎక్కువ మందికి అనుకూలం కానుందన్నారు. వందేభారత్‌లో విద్యార్థులు సెల్ఫీలు, రీల్స్‌ చేసుకుంటూ సందడి చేశారు. బెంగళూరులోని మెజస్టిక్‌ స్టేషన్‌ నుంచి కనీసం 4 కిలోమీటర్ల దూరం కూడా లేని యశ్వంతపుర స్టేషన్‌కు రూ.410 చార్జీగా ఉండడాన్ని పలు వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.

pandu3.2.jpg

Updated Date - 2023-06-28T13:46:23+05:30 IST