Bengaluru Opposition meet : విపక్షాల రెండో రోజు సమావేశం మరికాసేపట్లో ప్రారంభం.. శరద్ పవార్ హాజరుపై వీడిన సస్పెన్స్..
ABN , First Publish Date - 2023-07-18T09:45:08+05:30 IST
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. 26 రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 50 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. 26 రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 50 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) నేతృత్వంలో ఈ సమావేశం ఎజెండాను రూపొందిస్తారు. ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి వ్యూహం, సీట్ల పంపకాలు, కూటమి పేరు వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.
ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రతిపక్షాల మొదటి రోజు సమావేశానికి హాజరుకాకపోవడంతో కొంత ఆసక్తి రేకెత్తింది. రెండో రోజు సమావేశంలో పాల్గొనేందుకు ఆయన తన కుమార్తె సుప్రియ సూలేతో కలిసి చార్టర్డ్ విమానంలో మంగళవారం ఉదయం ముంబై నుంచి బెంగళూరుకు బయల్దేరారు. దీంతో ఆయన హాజరుపై సస్పెన్స్‌కు తెర పడింది.
ప్రతిపక్షాల సమావేశంలో రెండో రోజైన మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం, మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం పునఃప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు నేతలంతా కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొంటారు.
సోమవారం జరిగిన సమావేశంలో 50 మందికిపైగా ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వీరందరికీ విందు ఇచ్చారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రముఖ ప్రతిపక్ష నేతల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు.
ప్రతిపక్షాల ఐక్యతకు గత నెలలో పాట్నాలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) నేతృత్వంలో జరిగిన సమావేశంలో సుమారు 15 పార్టీలు పాల్గొన్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య 26కు పెరిగింది.
ఇదిలావుండగా, అధికార కూటమి ఎన్డీయే కూడా మంగళవారం ఢిల్లీలో సమావేశమవుతోంది. ఈ సమావేశానికి దాదాపు 38 పార్టీలు హాజరుకాబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన మాత్రమే హాజరవుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ స్పందిస్తూ, బీజేపీని సవాల్ చేయడానికి ప్రతిపక్షాలు చేతులు కలపడంతో, ఎన్డీయే ఓ ప్రహసనమని తేలిన తర్వాత చాలా సంవత్సరాల అనంతరం మళ్లీ దానిని పునరుద్ధరించడానికి కాషాయ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ప్రతిపక్షాల కూటమికి నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించవచ్చునని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
CPM: బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలనే
Minister: ఆసుపత్రి నుంచి నేరుగా జైలుకే.. ఫస్ట్ క్లాస్ వసతులతో ఉన్న గది కేటాయింపు