Bengaluru: చంద్రబాబుకు బెయిల్‌తో ‘దీపావళి’ ముందే వచ్చింది
ABN , First Publish Date - 2023-11-01T12:36:58+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు నాలుగువారాలపాటు
- తెలుగుదేశం పార్టీ కర్ణాటక కో-ఆర్డినేటర్ రావి మోహన్‌చౌదరి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు నాలుగువారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై కర్ణాటక తెలుగుదేశం పార్టీ కో-ఆర్డినేటర్ రావి మోహన్‌చౌదరి(Ravi Mohan Choudhary) హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం అభిమానులు వారాలకొద్దీ జరుపుతున్న పోరాటానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. ఈ మేరకు బెంగళూరులో మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుక్షణం తపిస్తున్న చంద్రబాబును ఏ విధమైన సాక్ష్యాలు లేకుండా అక్రమంగా, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేయడం తీరని అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో దీపావళి పండుగ ముందే వచ్చినంతగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది చీకటిపై సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. తమ నాయకుడు అరెస్టు అయిన నాటి నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపిన కర్ణాటకలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బెంగళూరు తెలుగుదేశం ఫోరం సభ్యులు, కన్నడ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేవ, పసలేని కేసులను అక్రమంగా చంద్రబాబుపై మోపి రాజకీయంగా వేధించడం మంచి పరిణామం కాదన్నారు. అధికారం శాశ్వతం కాదని, ఆంధ్రప్రదేశ్ పాలకులు ఇకనైనా గుర్తెరగాలన్నారు. ఇలా అక్రమ కేసులతో అందరినీ వేధిస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని హెచ్చరించారు. చంద్రబాబుపై అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ రద్దు చేయాలని ఆయన కోరారు.