Bengaluru Namma Metro: ఈ రూట్‌లో మెట్రోలో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2023-09-04T16:04:16+05:30 IST

తీవ్ర రద్దీతో ఇబ్బందులు పడుతున్న మెట్రో ప్రయాణికులకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) శుభవార్త చెప్పింది.

Bengaluru Namma Metro: ఈ రూట్‌లో మెట్రోలో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్!

బెంగళూరు: తీవ్ర రద్దీతో ఇబ్బందులు పడుతున్న మెట్రో ప్రయాణికులకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) శుభవార్త చెప్పింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు మెట్రో రైళ్ల సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మహాత్మా గాంధీ రోడ్ స్టేషన్ - నాడప్రభు కెంపేగౌడ మెజెస్టిక్ మెట్రో స్టేషన్ల మధ్య ఈ అదనపు మెట్రో రైళ్లను నడుపుతున్నట్లు నమ్మ మెట్రో వెల్లడించింది. అది కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సోమవారం నుంచి శుక్రవారం వరకు నడపనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో పర్పుల్ లైన్‌లో అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర రద్దీతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఉపశమనం లభించనుంది. కాగా ఈ అదనపు మెట్రో సేవలు సెప్టెంబర్ 1 నుంచే అందుబాటులోకి వచ్చాయి. పర్పుల్ లైన్‌లోని ఈ అనుబంధ రైళ్లు ట్రయల్ ఇనిషియేటివ్‌గా అమలు చేయబడుతున్నాయి. ఈ అదనపు మెట్రో రైళ్ల వలన ప్రయోజనం కల్గితే రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా అదనపు మెట్రోలను నడిపే అవకాశాలున్నాయి.


“నాడప్రభు కెంపేగౌడ స్టేషన్ - మెజెస్టిక్, మహాత్మా గాంధీ రోడ్ మెట్రో స్టేషన్ల మధ్య ఉదయం రద్దీ సమయాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి బీఎంఆర్‌సీఎల్ (BMRCL) 1 సెప్టెంబర్ 2023 నుంచి వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అదనపు రైళ్లను నడపనుంది. ఈ అదనపు రైళ్లు పర్పుల్ లైన్‌లో ట్రయల్ ప్రాతిపదికన నడుస్తాయి" అని నమ్మ మెట్రో అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సర్వీసులకు ఎంజీ (MG) రోడ్ స్టేషన్‌లో టెర్మినేషన్ పాయింట్ ఉంటుంది. బైయప్పనహళ్లికి వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా ఎంజీ రోడ్డు స్టేషన్‌లో రైలు మారాల్సి ఉంటుంది. అలాగే మహాత్మా గాంధీ రోడ్డు దాటి బైయప్పనహళ్లి వైపు వెళ్లే ప్రయాణికులు కూడా మహాత్మా గాంధీ రోడ్డు మెట్రో స్టేషన్‌లో రైలు మారాలని నమ్మ మెట్రో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉంది. కాగా బెంగళూరు మెట్రోకే నమ్మ మెట్రో అని నామకరణం చేయబడిందనే సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-04T16:07:43+05:30 IST