Bengaluru: సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ.. చంద్రబాబుకు మద్దతుగా...
ABN , First Publish Date - 2023-09-26T11:31:57+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ పావగడలో
పావగడ(బెంగళూరు): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ పావగడలో సోమవారం ఆయన అభిమానులు, ఐటీ ఉద్యోగులు, యువత పార్టీలకు అతీతంగా పెద్దఎత్తున తరలి వచ్చి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ నుంచి శనిమహాత్మ సర్కిల్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకు సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా వివేకానంద విద్యాసంస్థ కార్యదర్శి డాక్టర్ జి.వెంకటరామయ్య మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే మచ్చలేని నాయకుడని, భావితరాల భవిష్యత్తు కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు. అక్రమ కేసుల నుంచి ఆయన బయటపడి 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ మహిళలకు టీడీపీలో అత్యం త ప్రాధాన్యత కల్పించిన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా యావత్ భారత్ దేశానికే రాజకీయ ఆదర్శ ప్రాయుడని తెలిపారు. కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసనల పర్వం కొనసాగుతుండగా కర్ణాటకలోని పావగడ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా బాబుకోసం మేముసైతం అంటూ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వేల కోట్ల స్కాములు చేసిన జగన్ మచ్చలేని చంద్రబాబుపై స్కిల్ స్కామ్ కేసులో ఇరికించి అరెస్టు చేయించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనేక మంది చంద్రబాబు, జనసేన, నందమూరి అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు.