Bengaluru: మరోసారి కర్ణాటకకు షాక్.. నెలాఖరుదాకా రోజూ 3వేల క్యూసెక్కులు మాత్రమే..
ABN , First Publish Date - 2023-10-12T09:56:03+05:30 IST
కావేరి జలాల విషయంలో రాష్ట్రానికి మరోసారి షాక్ తగిలింది. తమిళనాడు(Tamilnadu)కు రోజుకు 3వేల క్యూసెక్కుల
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాల విషయంలో రాష్ట్రానికి మరోసారి షాక్ తగిలింది. తమిళనాడు(Tamilnadu)కు రోజుకు 3వేల క్యూసెక్కుల చొప్పున నెలాఖరుదాకా విడుదల చేయాలని కావేరి నీటి నిర్వహణా ప్రాధికార ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కావేరి ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేకున్నా నిర్వహణా ప్రాధికార మాత్రం 3వేల క్యూసెక్కులు చొప్పున విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వడంపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల విషయం తీవ్ర వివాదానికి కారణమవుతోంది. తమిళనాడు ప్రభుత్వం రోజూ 16వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజుల్లో 20.75 టీఎంసీలు విడుదల చేసేలా డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కావేరి నీటి నిర్వహణా ప్రాధికార సమావేశంలో కర్ణాటక తరపు న్యాయవాదులు వాస్తవ పరిస్థితిని వివరించారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు నెలకొందని, మరోవైపు తాగేందుకు నీరులేని పరిస్థితి కొనసాగుతోందని వాదించారు. కావేరి జలాశయాలకు ఇన్‌ఫ్లో తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో నీటి విడుదల అసాధ్యమని వివరించారు. తమిళనాడు తరపు వాదనలు విన్న మండలి ఈనెల 15తో ముగియనున్న 3వేల క్యూసెక్కుల నీటిని నెలాఖరుదాకా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తమిళనాడులో కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యుసీ ఆదేశాలను సమగ్రంగా పాటించడం లేదని మండిపడుతున్నారు. బుధవారం తమిళనాడులోని 8 జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. నాగపట్నం, తంజావూరు, తిరుచ్చి, తిరువారూరుతోపాటు పలుచోట్ల వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాగా 3వేల క్యూసెక్కులు విడుదల చేయాలనే ఆదేశాలపై మైసూరులో డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో రాజీ ఉండదన్నారు.