Bharat Jodo Yatra లౌకికవాద పరిరక్షణకే జోడో

ABN , First Publish Date - 2023-01-31T01:25:52+05:30 IST

‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టింది తన కోసమో, కాంగ్రెస్‌ కోసమో కాదని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పారు. దేశ ప్రజల కోసం.. భారత లౌకికవాద, ఉదారవాద విలువల పరిరక్షణ కోసం కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు నడక సాగించానన్నారు. దేశ పునాదులను ధ్వంసం చేసే సిద్ధాంతానికి వ్యతిరేకంగా

Bharat Jodo Yatra లౌకికవాద పరిరక్షణకే జోడో

దేశ ప్రజల కోసమే యాత్ర

దేశ పునాదులను ధ్వంసం చేసే

సిద్ధాంతానికి వ్యతిరేకంగా నిలబడాలి

బీజేపీ నేతలు కశ్మీర్లో ఇలాంటి యాత్ర చేపట్టలేరు

ఎందుకంటే వారికి భయం

రాహుల్‌గాంధీ ధ్వజం

శ్రీనగర్‌లో మంచువర్షంలోనే

జోడో యాత్ర ముగింపు సభ

పీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ

శ్రీనగర్‌, జనవరి 30: ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టింది తన కోసమో, కాంగ్రెస్‌ కోసమో కాదని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పారు. దేశ ప్రజల కోసం.. భారత లౌకికవాద, ఉదారవాద విలువల పరిరక్షణ కోసం కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు నడక సాగించానన్నారు. దేశ పునాదులను ధ్వంసం చేసే సిద్ధాంతానికి వ్యతిరేకంగా నిలబడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదివారమే ఈ యాత్ర పరిసమాప్తం కాగా.. సోమవారమిక్కడ ఎస్‌కే స్టేడియంలో భారీ మంచువర్షం నడుమే ముగింపు సభ నిర్వహించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డీఎంకే ఎంపీ తిరుచి శివ, ఆర్‌ఎ్‌సపీ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. తనలాగే బీజేపీ నేతలు కూడా జమ్మూకశ్మీరులో యాత్ర సాగించాలని రాహుల్‌ ఈ సందర్భంగా సవాల్‌ విసిరారు. ‘వారా పని చేయలేరు. అడ్డుకుంటారని కాదు.. భయం కారణంగానే చేయలేరు. నాపై దాడి జరగొచ్చని.. జోడో యాత్ర కశ్మీర్లో వద్దని కొందరు సలహా ఇచ్చారు. దీనిపై ఆలోచించాను. చివరకు నా ఇంట్లో, నా ప్రజలతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. తెల్లటి నా టీ షర్టును ఎర్రగా మార్చే అవకాశం ఇద్దామనుకున్నాను. కానీ కశ్మీరీలు నాకు హ్యాండ్‌ గ్రెనేడ్లు ఇవ్వలేదు.. ప్రేమ నిండిన హృదయాలను ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానులైన తన నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీలు హత్యకు గురైనప్పుడు ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఈ విషయం తెలిసిందని.. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్‌షా, బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌.. ఆ బాధను ఎప్పటికీ తెలుసుకోలేరని అన్నారు. ‘ఓ సైనికుడి కుటుంబం ఆ బాధను అర్థం చేసుకోగలుగుతుంది. ఇలాంటి కాల్‌ వస్తే ఎలా ఉంటుందో పుల్వామాలో హత్యకు గురైన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కుటుంబాలు, కశ్మీరీలకు అర్థమవుతుంది. మనం ప్రేమించేవారి మరణ సమాచారం తెలిపే ఈ ఫోన్‌ కాల్స్‌ ఇక రాకుండా చేయడమే నా యాత్ర లక్ష్యం’ అని తెలిపారు. ఈ సభకు మొత్తం 21 పార్టీలను ఆహ్వానించగా.. టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ స్పందించలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు రద్దవడం, ఆలస్యం కావడం.. శ్రీనగర్‌-జమ్ము హైవే మూసివేయడం తదితర కారణాలతో మిగతా విపక్షాల నేతలు సభకు రాలేకపోయారు.

నా ఇంటికెళ్తున్నా..

కశ్మీర్లో జోడో యాత్ర ప్రవేశించేటప్పుడు తన ఇంటికెళ్తున్నానని రాహుల్‌ తన తల్లి సోనియాగాంధీకి, చెల్లెలు ప్రియాంకాగాంధీకి సందేశం పంపారు. శ్రీనగర్‌లో సభలో ఆయనీ విషయం తెలియజేశారు. ఈ సందేశం గురించి ప్రియాంక తన వద్ద ప్రస్తావించినప్పుడు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. నెహ్రూ కుటుంబ మూలాలు కశ్మీర్లోనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ‘కశ్మీరుకు నడుస్తున్నప్పుడు.. నా పూర్వీకులు కశ్మీరు నుంచి అలహాబాద్‌కు వచ్చింది ఈ మార్గంలోనే కదా అని ఆలోచించాను. అందుచేత నేను నా ఇంటికి వస్తున్నట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ బంగళాల్లో నివసించాను. నాకంటూ ఇల్లు లేదు. ఈ భవంతులను ఇళ్లుగా నేను అంగీకరించలేదు. నా దృష్టిలో ఇల్లు అంటే ఆలోచన.. జీవన విధానం. మీరు కశ్మీరియత్‌ అంటారు. నేను నా ఇంటి గురించి ఆలోచించడం అంటాను. ఇది శివుడి ఆలోచన. లోతైన అర్థం చెప్పాలంటే శూన్యత.. అంటే స్వార్థరహితం. నాది అనేదానిపై పోరాటం. అహంకారంపైన, నీ ఆలోచనలపైన పోరాటం.. ఇస్లాంలో ఫనా అంటారు. అంటే జీవితార్పణం. ఇదే కశ్మీరియత్‌. ఈ ఆలోచనావిధానం ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది. గుజరాత్‌లో శూన్యతను వైష్ణవ్‌ జన్‌ తో అంటారు. గాంధీజీ ఇదే సందేశం ఇచ్చారు. కశ్మీరియత్‌ అంటే ఒకరినొకరు కలపడం.. ఇతరులపై గాక తనపై తాను దాడిచేసుకోవడం’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. సభలో ప్రియాంక మాట్లాడుతూ.. తన సోదరుడు 5 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేశారని ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కాగా.. యాత్ర విడిది చేసిన పంథచౌక్‌ వద్ద, ఆ తర్వాత పీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రాహుల్‌ ఆవిష్కరించారు. మంచువర్షంలో రాహుల్‌, ప్రియాంక కాసేపు ఆడుకున్నారు. మంచుగడ్డలను ఒకరిపై ఒకరు విసురుకుని కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు నింపారు.

సంపన్నులకే మోదీ, బీజేపీ మద్దతు: ఖర్గే

జమ్మూకశ్మీరుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు రాహుల్‌ కట్టుబడి ఉన్నారని ఏఐసీసీ అఽధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సభలో అన్నారు. ‘ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ దేశంలో ధనికులు, పేదల మధ్య వ్యత్యాసాన్ని విస్తరించే విధానాన్ని అనుసరిస్తున్నారు. పేద ప్రజలు పేదలుగానే ఉండాలని, ధనికులు మరింత ధనవంతులు కావాలని వారు భావిస్తున్నారు. 10 శాతం మంది 72 శాతం దేశ సంపదను దోచుకుంటున్నారు. 50 శాతం మంది ప్రజలకు దేశ సంపదలో 3 శాతం మాత్రమే ఉంది’ అని తెలిపారు. బీజేపీ రాజ్‌ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఐ నాయకుడు డి.రాజా పిలుపిచ్చారు. జోడో యాత్ర విజయవంతమైందని ఒమర్‌ ప్రశంసించారు. దేశం రాహుల్‌లో ఓ ఆశాకిరణాన్ని చూస్తోందని ముఫ్తీ అన్నారు.

దేశం కొత్త రాహుల్‌ని చూస్తోంది

తిరువనంతపురం, జనవరి 30: ‘‘భారత్‌ జోడో యాత్ర ముగిసింది. దేశం ఓ కొత్త రాహుల్‌ గాంధీని చూస్తోంది’’ అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని అన్నారు. సోమవారం మహాత్ముని 75వ వర్ధంతిని పురస్కరించుకొని కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆంటోనీ మాట్లాడారు. ‘‘రెండవ అంకం ప్రారంభించడానికి ఇది సరయిన సమయం. అసహన ధోరణులతో, విద్వేషంతో దేశాన్ని విభజించడానికి చూస్తున్న శక్తులను బలహీనపరచడానికి, ఓడించడానికి ఇదే మంచి అవకాశం. కొత్త రాహుల్‌ గాంధీ దేశాన్ని రక్షిస్తాడు... విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న శక్తులపై పోరాటానికి నాయకత్వం వహిస్తాడు’’ అని ఆంటోనీ అన్నారు.

Updated Date - 2023-01-31T01:26:01+05:30 IST