Mehbooba Mufti: స్వచ్ఛమైన గాలిలా రాహుల్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-01-28T18:07:42+05:30 IST
దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చివరి మజిలీగా రాహుల్ గాంధీ సారథ్యంలోని 'భారత్ జోడో యాత్ర' ముందుకు..
పుల్వామా: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చివరి మజిలీగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలోని 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) ముందుకు సాగుతోంది. భద్రతా కారణాలతో శుక్రవారంనాడు అర్థాంతరంగా ఆగిన పాదయాత్ర శనివారం అవంతిపోరలో తిరిగి ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఈ యాత్రలో పాల్గొని, రాహుల్‌తో కలిసి నడిచారు. రాహుల్ గాంధీతో పాటు యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ వాద్రాను మెహబూబా ముఫ్తీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ గాంధీ యాత్ర కశ్మీర్‌లో స్వచ్ఛమైన గాలిలా వస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. ''రాహుల్ గాంధీ యాత్ర కశ్మీర్‌లో స్వచ్ఛమైన గాలిలా వస్తోంది. 2019 తర్వాత కశ్మీరీలు ఇంత పెద్ద సంఖ్యలో తమ ఇళ్ల నుంచి బయటకు రావడం ఇదే మొదటిసారి. రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొనడం గొప్ప అనుభవం'' అని ఆమె ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
స్పందన బాగుంది: ఒమర్ అబ్దుల్లా
మరోవైపు, శుక్రవారం రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సైతం ఉదయం ఓ ట్వీట్‌లో భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందనను అభినందించారు. జమ్మూకశ్మీర్‌లో యాత్రకు చాలా మంచి స్పందన వస్తోందని, వయోభేదం లేకుండా పురుషులు, మహిళలు ఐక్యతా మార్చ్‌లో సందడిగా పాల్గొంటున్నారని ట్వీట్ చేశారు.
దీనికి ముందు, శనివారం ఉదయం భారత్ జోడో యాత్రకు సంబంధించిన భద్రతపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే సైతం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. రాబోయే రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజానీకం యాత్రలో పాల్గొంటారనే అంచనాలు ఉన్నాయని, 30వ తేదీన శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంతో యాత్ర ముగుస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు పలు పార్టీల దిగ్గజ నేతలు హాజరవుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని యాత్ర ముగిసేంత వరకూ తగినంత భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సిందిగా అధికారులకు ఆదేశించాలని హోం మంత్రిని ఆయన కోరారు.
యాత్రకు అవాంతరాలు
రాహుల్ భారత్ జోడో యాత్ర శుక్రవారంనాడు కిలోమీటర్ యాత్ర సాగించిన తర్వాత అర్థాంతరంగా నిలిచిపోయింది. భద్రతా లోపాల కారణంగానే యాత్రను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. గత బుధవారంనడు కూడా వాతావరణ ప్రతికూలత, కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా యాత్ర వాయిదా పడింది. తమిళనాడులోని కన్యాకుమారిలో గత ఏడాది సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా, 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 3,970 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకుని ఈనెల 30న శ్రీనగర్‌లో జరిగే ర్యాలీతో ముగియనుంది. దేశంలోని వివిధ పార్టీల ప్రముఖులను ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాలు పంపింది.