CM Bhupesh Baghel: ‘‘ప్రజల్ని భయపెట్టించేందుకే బీజేపీ ఈ దాడులు చేస్తోంది’’.. మోదీపై ఛత్తీస్‌గఢ్ సీఎం ధ్వజం
ABN , First Publish Date - 2023-11-08T21:46:31+05:30 IST
Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల హంగామా మొదలైనప్పటి నుంచి అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్, అధికారం దక్కించుకోవడం బీజేపీ.. తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. ఒకరిపై మరొకరు సవాల్‌కి ప్రతిసవాళ్లు, విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల హంగామా మొదలైనప్పటి నుంచి అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్, అధికారం దక్కించుకోవడం బీజేపీ.. తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. ఒకరిపై మరొకరు సవాల్‌కి ప్రతిసవాళ్లు, విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇంతలో అక్కడ తొలి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే.. సీన్‌లోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో.. సీఎం భూపేష్ బఘేల్ తారాస్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ వైఫల్యానికి ఈ దాడులే కారణమంటూ ధ్వజమెత్తారు.
అసలేమైందంటే.. బుధవారం ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో బాణాసంచా వ్యాపారి సురేష్ ధింగాని ప్రాంగణంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే.. ఏ కేసుకు సంబంధించి ఈ దాడులు నిర్వహించారన్న విషయం వెలుగులోకి రాలేదు. ఇంతకీ ఈ సురేష్ ధింగాని మరెవ్వరో కాదు.. సీఎం భూపేష్ బఘేల్‌కి అత్యంత సన్నిహితుడు. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన అధికారిక లెక్కలను ఆయన చూసుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ఆయన ప్రాంగణంలో ఈడీ దాడులు చేయడంతో.. బీజేపీపై భూపేష్ బఘేల్ విరుచుకుపడ్డారు. తన ఎన్నికల ఖర్చు రికార్డ్‌ని నిర్వహిస్తున్న వ్యక్తి ప్రాంగణానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను పంపారని.. తన నియోజక వర్గ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం ఇది అని పేర్కొన్నారు.
‘‘మొదటి దశ ఎగ్జిట్ పోల్ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుందని అనుకున్నాను. కానీ.. సాహెబ్ (ప్రధాని మోదీ) ఈరోజు ఉదయాన్నే ఆ లెక్కలు చెప్పేశారు. నా నామినేషన్ సమయంలో నాతో పాటు ఉన్న, నా ఎన్నికల ప్రక్రియలో ఖర్చులకు సంబంధించి అధికారిక రికార్డ్‌ని మెయింటెయిన్ చేస్తున్న సురేష్ ధింగాని ప్రాంతంలో ఉదయాన్నే ఈడీ పంపబడింది. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను భయాందోళనకు గురిచేసే ఈ ప్రయత్నం.. మంగళవారం 20 స్థానాలకు జరిగిన ఓటింగ్‌లో బీజేపీకి లభించిన వైఫల్యమే అవుతుంది. ఛత్తీస్‌గఢి ప్రజలను బలహీనులుగా, పిరికివాళ్లుగా భావించకండి. తాము కష్టపడి సంపాదించిన డబ్బులతోనే అన్నం తింటారు. అది కూడా పూర్తి ఆత్మగౌరవంతో’’ అంటూ ఎక్స్ వేదికగా భూపేష్ బఘేల్ రాసుకొచ్చారు.
కాగా.. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు గాను నవంబర్ 7వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు సంబంధించి రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయఢంకా మోగిస్తుందని ఇప్పటికే కొన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. గతంతో పోలిస్తే.. ఈసారి మరింత మెజారిటీతో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేశాయి. అటు.. బీజేపీకి కూడా ఓట్ల శాతం పెరుగుతాయి కానీ, గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని ఆ సర్వేలు పేర్కొన్నాయి. మరి.. అసలు ఫలితాలు ఎలా నమోదు అవుతాయో? రెండో దశ ఎన్నికలు ముగిశాక డిసెంబర్ 3వ తేదీన రానున్న రిజల్ట్ వరకూ వేచి చూడాల్సిందే.