Bihar: నితీష్‌కు షాక్.. మంత్రి రాజీనామా..

ABN , First Publish Date - 2023-06-13T14:27:24+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కు ఆయన మంత్రివర్గ సహచరుడు, జితిన్ రామ్ మాంఝీ తనయుడు సంతోష్ కుమార్ సుమన్ షాక్ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సంతోష్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

 Bihar: నితీష్‌కు షాక్.. మంత్రి రాజీనామా..

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kumar)కు ఆయన మంత్రివర్గ సహచరుడు, జితిన్ రామ్ మాంఝీ తనయుడు సంతోష్ కుమార్ సుమన్ (Santosh Kumar Suman) షాక్ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సంతోష్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన తండ్రి ఏర్పాటు చేసిన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM)ను జేడీయూలో విలీనం చేయాలంటూ ఆయనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒత్తిడి తెస్తున్నారంటూ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సంతోష్ కుమార్ ఆరోపించారు.

పాట్నాలో ఈనెల 23న జరుగనున్న విపక్ష పార్టీల సమావేశానికి హెచ్ఏఎం పార్టీ వెళ్తోందా అని సంతోష్ కుమార్‌ను అడిగినప్పుడు, తమను ఆహ్వానించనప్పడు, తమ పార్టీని ఒక పార్టీగా గుర్తించనప్పుడు ఎలా తమను ఆహ్వానిస్తారని ఆయన ఎదురు ప్రశ్నించారు. తమ పార్టీ ఉనికికే ముప్పు ఉన్నందున దానిని రక్షించుకునేందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు.

ఎన్డీయేలో చేరే ఆలోచనపై..

ఎన్డీయేలో చేరే ఆలోచనపై సంతోష్ కుమార్ సుమన్‌ను ప్రశ్నించినప్పుడు, ఆ విషయమై ఇంతవరకూ ఎవరూ తమను సంప్రదించలేదని చెప్పారు. తమది స్వతంత్ర పార్టీ అని, పార్టీ ఉనికిని తాము కాపాడుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎన్డీయేలో చేరే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఇప్పటికీ తాము మహాఘట్‌బంధన్‌లోనే ఉన్నామని చెప్పారు.

ఐదు సీట్లు కోరుతున్న హెచ్ఏఎం

బీహార్‌లోని అధికార మహాకూటమి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హెచ్ఏఎంకు 5 సీట్లు ఇవ్వాలని బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ గత శుక్రవారంనాడు డిమాండ్ చేశారు. హెచ్ఏఎం జాతీయ అధ్యక్షుడుగా సంతోష్ కుమార్ ఉన్నారు. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో తమకు 5 సీట్ల కంటే తక్కువ ఇస్తే ఆమోదయోగ్యం కాదని ఆయన సైతం గత వారంలో ప్రకటించారు. బీహార్‌లో గుర్తింపు పొందిన హెచ్ఏఎంను జితిన్ రామ్ మాంఠీ 2015లో స్థాపించారు. బీహార్ అసెంబ్లీలో ఆ పార్టీకి 4 సీట్లు ఉన్నాయి. దళిత నేత అయిన జితిన్ రామ్‌కు మాంఠీ కమ్యూనిటీలో మంచి పేరు ఉంది.

Updated Date - 2023-06-13T14:29:12+05:30 IST