Bihar : హిందూ పండుగలకు సెలవుల కుదింపు.. బిహార్‌లో షరియా చట్టం రాబోతోందంటున్న బీజేపీ..
ABN , First Publish Date - 2023-08-30T13:42:23+05:30 IST
హిందూ పండుగలకు సెలవులను తగ్గిస్తూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ మనోభావాలను దెబ్బతిస్తోందని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. bjp alleges cm nitish government might implement shariat law in bihar soon as holidays for hindu festivals for schools curtailed
న్యూఢిల్లీ : హిందూ పండుగలకు సెలవులను తగ్గిస్తూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ మనోభావాలను దెబ్బతిస్తోందని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం త్వరలోనే షరియా చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.
బిహార్ విద్యా శాఖ హిందువుల పండుగలకు సెలవులను రద్దు చేసిందని గిరిరాజ్ ట్వీట్ చేశారు. దుర్గా పూజ, దీపావళి, ఛాత్ పూజ రోజుల్లో సెలవులను రద్దు చేసిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో షరియా చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని, హిందూ పండుగలను జరుపుకోవడంపై నిషేధం విధించే అవకాశం ఉందని అన్నారు.
బీజేపీ బిహార్ శాఖ చీఫ్ సామ్రాట్ చౌదరి ఇచ్చిన ట్వీట్‌లో, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. దురహంకారపూరిత బిహార్ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు. మామాఅల్లుళ్ళ (ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్) ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి వెనుకాడటం లేదన్నారు. బిహార్‌లో హిందువులు తమ పండుగలను సైతం జరుపుకోవడానికి వీల్లేదా? అని ప్రశ్నించారు. దుర్గా పూజ, దీపావళి పండుగలతోపాటు ఛాత్ పూజల రోజుల్లో సెలవులను కూడా కుదించారని మండిపడ్డారు. ఇది చాలా దురదృష్టకరమని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నవారికి బిహార్ ప్రజానీకం 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ, 2025లో జరిగే శాసన సభ ఎన్నికల్లోనూ దీటుగా సమాధానం చెబుతుందన్నారు.
బిహార్ ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 23 సెలవులు ఉండేవి. వీటిని 11 రోజులకు తగ్గిస్తూ బిహార్ రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31న రాఖీ పండుగ సెలవును కూడా రద్దు చేసింది. దుర్గా పూజకు ఆరు రోజులు సెలవులు ఇచ్చేవారు, కానీ ఈ సెలవులను మూడు రోజులకు కుదించారు. దీపావళి నుంచి ఛాత్ పూజల వరకు నవంబరు 13 నుంచి 21 వరకు తొమ్మిది రోజులు సెలవులు ఉండేవి. కానీ దీపావళికి నవంబరు 12న, చిత్రగుప్త పూజ కోసం నవంబరు 15న మాత్రమే సెలవులు ప్రకటించింది. ఛాత్ పూజ కోసం నవంబరు 19, 20 మాత్రమే సెలవులని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు