BJP Annamalai: నేడు అన్నామలై పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-07-28T08:43:07+05:30 IST

వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai0 శుక్రవారం సా

BJP Annamalai: నేడు అన్నామలై పాదయాత్ర ప్రారంభం

- రామేశ్వరంలో ప్రారంభించనున్న అమిత్‌షా

- వందరోజుల యాత్రకు భారీ ఏర్పాట్లు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai0 శుక్రవారం సాయంత్రం రామేశ్వరం(Rameswaram) నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించి అనంతరం జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రెండు రోజుల పర్యటన నిమిత్తం అమిత్‌షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.50 గంటలకు మదురై విమానాశ్రయం(Madurai Airport) చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రామేశ్వరం సమీపంలోని మండపం ప్రాంతానికి విచ్చేస్తారు. అక్కడి నుంచి కారులో రామేశ్వరం చేరుకుని హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం 5.,45 గంటలకు పాదయాత్ర సభా ప్రాంగణానికి వెళతారు. పాదయాత్ర ప్రారంభించి, ప్రసంగిస్తారు. ఈ సభలో మాజీమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నేతలు పాల్గొంటారు. ఈ సభ అనంతరం అమిత్‌షా రాత్రి హోటల్‌లోనే బసచేస్తారు. శనివారం ఉదయం రామనాఽథస్వామివారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు అక్కడి స్టార్‌ హోటల్‌లో జరిగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కలాం కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు కుత్తుకాల్‌లో ఉన్న వివేకానంద స్మారక మండపానికి వెళతారు.

అక్కడి నుంచిమండపం చేరుకుని హెలికాప్టర్‌లో మదురై విమానాశ్రయం వెళ్ళి మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. అమిత్‌షా పర్యటన, అన్నామలై పాదయాత్రను పురస్కరించుకుని డీఐజీ దురై నాయకత్వంలో ఐదుగురు ఎస్పీలు, 30 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు సహా సుమారు రెండు వేలమంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక అన్నామలై పాదయాత్ర ప్రారంభోత్సవ సభా వేదికను బీజేపీ నిర్వాహకులు పార్లమెంట్‌ ఆకారంలో రూపొందించారు. రామేశ్వరం బస్టాండు నుండి పాంబన్‌ వంతెన దాకా రహదారికి ఇరువైపులా పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బీజేపీ తొమ్మిదిదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేసేలా ముద్రించిన పుస్తకాలను, కరపత్రాలను అన్నామలై పాదయాత్రలో ప్రజలకు పంపిణీ చేయనున్నారు. పాదయాత్ర మార్గంలోని పవిత్రస్థలాల్లో మట్టిని సేకరించి, పాదయాత్ర ముగిశాక ఆ మన్నుతో భారతమాత విగ్రహాన్ని రూపొందించనున్నారు. శుక్రవారం పాదయాత్ర చేపట్టనున్న అన్నామలై... రామేశ్వరం నగరమంతటా పర్యటిస్తారు. రామేశ్వరంలో రాత్రి బసచేసిన తర్వాత మరుసటి రోజు అక్కడి బయలుదేరి తంగచ్చిమఠం, పాంబన్‌ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటారు. రాత్రి రామనాధపురంలో బసచేస్తారు. ఈ నెల 30న ముదగళత్తూరు, పరమకుడి, తిరువట్టానై ప్రాంతాల్లోనూ ఆగస్టు ఒకటిన మదురైలో, రెండున ఆలంగుడిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర వచ్చే యేడాది జనవరి 11న చెన్నై నగరంలో ముగియనుంది.

ఈపీఎస్‌ హాజరవుతారా?

అన్నామలై పాదయాత్ర ప్రారంభోత్సవానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి హాజరవుతారో లేదోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ యాత్రకు రావాలని ఎడప్పాడికి బీజేపీ నుంచి ఆహ్వానం పంపారు. అయితే ఆయన హాజరవుతారా లేదా అన్నదానిపై ఇప్పటి వరకూ అన్నాడీఎంకే నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఆయన రాకపై బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-07-28T08:43:07+05:30 IST