Showcause notice: లోక్‌సభలో అనుచిత వ్యాఖ్యలు..బీజేపీ ఎంపీకి షోకాజ్ నోటీసు
ABN , First Publish Date - 2023-09-22T17:05:35+05:30 IST
బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీపై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీపై ఆ పార్టీ చర్యలకు దిగింది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. పార్లమెంటులో బిధూడీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఎంపీ డానిష్ అలీ (Danish Ali)పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ (BJP) ఎంపీ రమేష్ బిధూడీ (Ramesh Bidhuri)పై ఆ పార్టీ చర్యలకు దిగింది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. పార్లమెంటులో బిధూడీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బిధూడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణనలోకి తీసుకుంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శుక్రవారంనాడు ఆయనకు షోకాజ్ నోటీసులు పంపారు.
'ముల్లా టెర్రరిస్ట్' అంటూ బిధూడీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటు కొత్త భవనంలో అడుగుపెట్టగానే బీజేపీ అసలు ఉద్దేశాలు బయటపడ్డాయంటూ విమర్శలు గుప్పించారు. కాగా, తనపై బిధూడీ చేసిన వ్యాఖ్యలపై డానిష్ అలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై దర్యాప్తు జరిపాలించాలని స్పీకర్‌ను కోరారు.
''బీజేపీ ఎంపీ తన ప్రసంగంలో నన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు లోక్‌సభ రికార్డుల్లో నమోదయ్యాయి. స్పీకర్‌గా మీ నేతృత్వంలో కొత్త పార్లమెంటు భవనంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఇంత సమున్నత దేశానికి ఒక మైనారిటీ సభ్యుడిగా, ఎంపీగా ఉన్న నాకు ఈ పరిణామం ఎంతో ఆవేదన కలిగించింది'' అని డానిష్ అలీ ఆ లేఖలో పేర్కొన్నారు. 227వ నిబంధన క్రింద ఈ అంశంపై విచారణ జరిపించి నివేదికకు ఆదేశించాలని, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఈ తరహా వాతావరణం దేశంలో బలపడకుండా చూసినట్టవుతుందని అన్నారు.