Mahadev app scam: బీజేపీ ముడుపులు తీసుకుని తప్పు ఇంకొకరిపై గెంటుతోంది: సీఎం
ABN , First Publish Date - 2023-11-05T15:52:10+05:30 IST
మహదేవ్ యాప్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తిప్పికొట్టారు. యాప్ ప్రమోటర్ల నుంచి బీజేపీ నేతలు ముడుపులు తీసుకున్నందునే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎదురుదాడి చేశారు.
రాయపూర్: మహదేవ్ యాప్ స్కామ్ (Mahdev app Scam)లో తన ప్రమేయం ఉందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) తిప్పికొట్టారు. యాప్ ప్రమోటర్ల నుంచి బీజేపీ (BJP_ నేతలు ముడుపులు తీసుకున్నందునే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, యథాప్రకారం యాప్ కార్యక్రమాలు నడుస్తున్నాయని ప్రత్యోరోపణలు చేశారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలు స్వయంగా ఈ స్కామ్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌పై నిందారోపణలు చేస్తున్నారని చెప్పారు.
బీజేపీ నేత కమల్ సింగ్‌తో మహదేవ్ యాప్ ప్రధాన నిందితుడు ఉన్న ఫోటోపై అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ...''వాళ్లు(బీజేపీ నేతలు) తప్పిదాలు చేస్తుంటారు. ఇతరుల మీద నిందలు వేస్తారు. వాళ్లకు ఆయనతో (యాప్ నిందితుడు) సంబంధాలున్నాయి. వాళ్లు ఆయన మిత్రులు. బీజేపీ కౌన్సిలర్ ఒకరు నిందితుడికి సన్నిహిత మిత్రుడు. గతంలోనూ ఈ విషయం చెప్పాను. మహదేవ్ యాప్ విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు మూసేయలేదు? లుకవుట్ సర్క్యులర్ జారీ చేసినప్పుడు నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదు? దీని అర్ధం వాళ్లతో మీ డీల్ పూర్తయినట్టేగా?'' అని బీజేపీని బూపేష్ భఘెల్ నిలదీశారు.
నిజానికి స్కామ్‌లో ప్రమేయం ఉన్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకున్నది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమేనని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం 450 మందిని అరెస్టు చేసిందని, ఆస్తులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ సీజ్ చేసిందని, డజన్ల కొద్దీ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిందని తెలిపారు. దేశంలో ఎవరూ ఇంత పెద్దఎత్తున చర్యలు తీసుకున్నదే లేదని వివరించారు. కాంగ్రెస్ ప్రమేయమే ఉంటే చర్యలు ఎందుకు తీసుకున్నామని నిలదీశారు. ఈ స్కామ్‌లో బేజీపీ నేతల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. మహదేవ్ యాప్ ప్రమోటర్లు ముఖ్యమంత్రికి ఇంతవరకూ రూ.508 కోట్లు చెల్లించినట్టు తాజా సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని ఈడీ ఇటీవల ఆరోపించింది. నిందితుడి నుంచి నిధులు అందుకున్నట్టు పరోక్షంగా సీఎంపై మోదీ సైతం ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచార సభలో ఆరోపణలు చేశారు.