BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. అవినీతి కేసులోనే జయకు శిక్ష

ABN , First Publish Date - 2023-06-13T10:17:19+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) చేసిన వ్యాఖ్యలు మరోమారు అన్నాడీఎంకే నేతలకు ఆగ్రహం తెప్పిం

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. అవినీతి కేసులోనే జయకు శిక్ష

అడయార్‌(చెన్నై): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) చేసిన వ్యాఖ్యలు మరోమారు అన్నాడీఎంకే నేతలకు ఆగ్రహం తెప్పించాయి. అన్నాడీఎంకేతో పొత్తుపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆనక వాటిని సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడిన అన్నామలై.. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ పాలన పట్ల చేసిన వ్యాఖ్యలు మిత్రకూటమిలో నిప్పు రాజేశాయి. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై మాట్లాడుతూ.. అవినీతి కేసులోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు జైలుశిక్ష పడిందని పేర్కొన్నారు. అంతేగాక గత 1991-96 మధ్య ఉన్న ప్రభుత్వ పాలనే అత్యంత అవినీతిమయమైనదని ఆరోపించారు. ఆ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు జయ చేతిలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా అన్నామలై మాట్లాడుతూ.. త్వరలోనే మళ్లీ డీఎంకే(DMK) నేతల అవినీతి చిట్టా బయటపెడతానన్నారు. తాము పార్టీలకు వ్యతిరేకంగా అవినీతిపరుల చిట్టాను బహిర్గతం చేయలేదని, తమ పార్టీ అవినీతికి వ్యతిరేకం కావడం వల్లే అవినీతిపరుల జాబితాను వెల్లడిస్తున్నామని తెలిపారు. అందులో అన్నాడీఎంకే నేతల అవినీతి చిట్టా కూడా ఉంటుందన్నారు. అది 1991-96 మధ్య కాలంలోని ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన జాబితా అని వివరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గత అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వ హయాంలో భారీస్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రజలే చెబుతున్నారని గుర్తు చేశారు. అవినీతి కేసులోనే జయను కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష కూడా విధించిందన్నారు.

అన్నామలైకు నోటి దురుసు...

- మాజీ మంత్రి జయకుమార్‌ ధ్వజం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు నోటి దురుసు ఎక్కువ అని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) మండిపడ్డారు. 1991-96 మధ్య కాలంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైనదంటూ అన్నామలై చేసిన వ్యాఖ్యలను జయకుమార్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తప్పుబట్టారు. ‘అన్నామలైకు నోటి దురుసు ఎక్కువ. ఇంకా ఎక్కువ మాట్లాడితే గూబ గుయ్యి మంటుంది. విమర్శలకు కూడా ఓ హద్దుంటుంది. అన్నింటినీ దిగమింగుకొని కొనసాగలేం. కూటమిలో ఉంటూనే మాపార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేస్తే ఎలా? అన్నామలైనియంతలా వ్యవహరిస్తున్నారు. అన్నాడీఎంకేతో బీజేపీ కూటమి కొనసాగడం ఆయనకు నచ్చలేదన్న చందంగా ఆయన వ్యాఖ్యలున్నాయి. అన్నామలైపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తగిన చర్యలు తీసుకోవాలి. అన్నాడీఎంకేతో ఉంటేనే బీజేపీకి బలం’ అని జయకుమార్‌ కటువుగా వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-13T10:17:21+05:30 IST