BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ పాదయాత్రకు బ్రేక్‌

ABN , First Publish Date - 2023-08-08T08:14:13+05:30 IST

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(BJP president Annamalai) చేపట్టిన యాత్ర రెండ్రోజులు వాయిదా పడింది. అన్నామలై తన పాదయాత్రలో

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ పాదయాత్రకు బ్రేక్‌

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(BJP president Annamalai) చేపట్టిన యాత్ర రెండ్రోజులు వాయిదా పడింది. అన్నామలై తన పాదయాత్రలో స్వల్ప మార్పులు చేశారు. ఆ మేరకు సోమవారం పర్యటించాల్సిన ప్రాంతాలు, బహిరంగ సమావేశాలను తాత్కాలికంగా రద్దు చేసుకున్న ఆయన.. చెన్నైకి తిరిగొచ్చారు. పాదయాత్రలో పాల్గొన్నప్పటి నుంచి అన్నామలై... డీఎంకేతో పాటు తమ మిత్రపక్షమైన అన్నాడీఎంకేను సైతం రోజుకో విధంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అన్నామలై విమర్శలను అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు డి.జయకుమార్‌, ఉదయ్‌కుమార్‌, సెల్లూర్‌ రాజు సహా పలువురు ఖండించడంతో పాటు బీజేపీ కూటమి నుంచి బయటకు రావాలని పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో, అన్నామలై చర్చనీయాంశమైన ప్రసంగాలపై ఢిల్లీ అధిష్ఠానానికి అన్నాడీఎంకే(AIADMK) తరఫున ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అన్నామలైతో బీజేపీ పెద్దలు మాట్లాడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం మదురై నుంచి విమానం ద్వారా అన్నామలై చెన్నైకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగింది. కానీ, రెండ్రోజుల విశ్రాంతి నిమిత్తం అన్నామలై పాదయాత్రను వాయిదా వేశారని, దీనిపై వదంతులు పుట్టించరాదని రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. అయినప్పటికీ, అన్నామలై పాదయాత్రకు బ్రేక్‌ పడడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-08-08T08:14:13+05:30 IST