BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారమే లక్ష్యం.. అన్నాడీఎంకేతో విభేదాల్లేవ్..
ABN , First Publish Date - 2023-09-22T08:24:11+05:30 IST
అన్నాడీఎంకే - బీజేపీ మధ్య ఎలాంటి సమస్యల్లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పేర్కొన్నారు.
పెరంబూర్(చెన్నై): అన్నాడీఎంకే - బీజేపీ మధ్య ఎలాంటి సమస్యల్లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించడమే పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో గురువారం అన్నామలై విలేకరులతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) మధ్య కూటమి ఉందా లేదా అని అందరూ ప్రశ్నిస్తున్నారని, అన్నామలైకు - అన్నాడీఎంకే మధ్య ఎలాంటి సమస్యల్లేవన్నారు. నాలుగురోజుల క్రితం మాజీ మంత్రులు జయకుమార్, ఉదయ్‌కుమార్, సెల్లూర్ రాజా తదితరులు పలు వ్యాఖ్యలు చేశారని, అవి తనపైనా... లేక పార్టీపైనా అనే సందేహం నెలకొందన్నారు. తనకు ఏ నాయకుడితోనూ సమస్యలు లేవని స్పష్టంచేశారు.ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉందని, ఆయనను తిరిగి ప్రధానిగా చేయాలని కూటమి పార్టీలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇక అన్నాడీఎంకే అభిప్రాయం కూడా అదేనన్నారు. మాజీ మంత్రి సెల్లూర్ రాజు కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును బీజేపీ ప్రకటించాలని కోరారని, ఆ విషయం తామెలా ప్రకటిస్తామని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ నాయకులు చూసుకుంటారన్నారు. తాను ఎవరినీ ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని, తనపై వచ్చే ఆరోపణలకు తగిన సమయంలో బదులిస్తున్నానని తెలిపారు. మానవత్వం చంపుకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు లక్ష్యం ఉందని, రాష్ట్రంలో అధికారం చేపట్టేలా వ్యవహరించడం తన బాధ్యత అన్నారు. రాష్ట్రంలో రెండు ద్రవిడ పార్టీలు 65 శాతం ఓట్లు కలిగి ఉండగా, మిగిలిన 35 శాతం పొందేందుకు తమకు అవకాశం ఉందన్నారు. అన్నాదురై గురించి తాను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని, పలు సందర్భాల్లో ఆయనను కీర్తించానని అన్నారు. అన్నాపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సీఎంగా ఈపీఎస్‌ను ప్రకటించాలి
- సెల్లూరు రాజు
ప్రధానిగా నరేంద్రమోదీ మళ్లీ అధికారం చేపట్టాలని తాము కోరుకుంటున్నామని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేరును బీజేపీ అంగీకరించాలని అన్నాడీఎంకే మాజీ మంత్రి సెల్లూరు రాజు కోరారు. కోవైలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే - బీజేపీ మధ్య ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు.