Share News

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చిత్తే..

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:04 PM

తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈసారి కాంగ్రెస్‌ ఎత్తులు ఫలించబోవని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌ కూటమి మొత్తం 28 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BJP state president B Y Vijayendra) పేర్కొన్నారు.

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చిత్తే..

- విజయపురలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈసారి కాంగ్రెస్‌ ఎత్తులు ఫలించబోవని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌ కూటమి మొత్తం 28 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BJP state president B Y Vijayendra) పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక తొలిసారి విజయపుర జిల్లాకు వచ్చిన విజయేంద్రకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం జరిగిన కార్యకర్తల సభలో విజయేంద్ర ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చక్కటి పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలన్నీ బూటకమని, దేశానికి మోదీయే గ్యారెంటీ అని చెప్పారు. 500 సంవత్సరాలుగా దేశ ప్రజలు కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్న అయోధ్య రామందిర నిర్మాణం కలను ఆయన సాకారం చేయడం దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమన్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు తీర్మానించుకున్నారని అన్నారు. ఈ దిశలో కన్నడిగులు సైతం మోదీకి భారీగా మద్దతు ప్రకటిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్ర కరువు కాటకాలతో ప్రజలు అలమటిస్తుంటే సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీల బుజ్జగింపు రాజకీయాల్లో మునిగి తేలుతోందని విరుచుకుపడ్డారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం కాదని, గతంలో యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలోనూ వారి సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన తరుణంలో మైనార్టీలు నివసించే కాలనీల అభివృద్ధికి రూ.1000 కోట్ల గ్రాంటును కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించడం సరైన నిర్ణయం కాదన్నారు. బిజాపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే యత్నాళ్‌ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే విడుదల చేయాలని, ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విజయేంద్ర ప్రకటించారు. కాగా విజయపురలోనే ఉన్నా విజయేంద్రను ఆహ్వానించేందుకు స్థానిక బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ హాజరు కాకపోవడం ఆసక్తి రేకెత్తించింది.

Updated Date - Dec 31 , 2023 | 12:04 PM