BJP state president: మీరు అర్జంటుగా ఢిల్లీకి రండి.. బీజేపీ రాష్ట్ర చీఫ్‏కు అధిష్టానం పిలుపు

ABN , First Publish Date - 2023-09-27T07:25:32+05:30 IST

ఇన్నాళ్లూ తమ కనుసన్నల్లో మసలుకున్న అన్నాడీఎంకే.. ఎట్టకేలకు తన దారి చూసుకోవడంతో.. తదుపరి వ్యూహంపై బీజేపీ

BJP state president: మీరు అర్జంటుగా ఢిల్లీకి రండి.. బీజేపీ రాష్ట్ర చీఫ్‏కు అధిష్టానం పిలుపు

- నేడు జాతీయ నేతలతో భేటీ

- అన్నాడీఎంకేతో పొత్తు విఫలంపై వివరణ!

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ తమ కనుసన్నల్లో మసలుకున్న అన్నాడీఎంకే.. ఎట్టకేలకు తన దారి చూసుకోవడంతో.. తదుపరి వ్యూహంపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)ని ఢిల్లీ పిలిపించుకుంది. అంతర్గత వ్యూహం ఎలా వున్నప్పటికీ బయటకు మాత్రం అన్నామలై నోటిదురుసు కారణమే తమ పొత్తు విడిపోవడానికి ప్రధాన కారణమని అన్నాడీఎంకే నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దివంగత మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, జయలలిత పట్ల అన్నామలై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. ప్రస్తుత అన్నాడీఎంకే నేతల పట్ల హేళనగా మాట్లాడారు. దీనికి తోడు తమతో పొత్తు కాదంటే రాష్ట్రంలో ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌’ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే(AIADMK) నేతల తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలోనే అన్నాడీఎంకే ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనగలిగే సత్తా లేనందున అన్నాడీఎంకేతో పొత్తును కాపాడుకోవాల్సిందని బీజేపీ జాతీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

దీనికి తోడు అన్నామలై ఒంటెత్తు పోకడలు బీజేపీ రాష్ట్ర శాఖలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీనియర్లు సైతం ఆయన వ్యవహారం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అధిష్ఠానానికి సైతం పలు ఫిర్యాదులు వెళ్లాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జాతీయ కార్యవర్గం .. అన్నామలైని ఢిల్లీ పిలిపించుకుంది. ఆ మేరకు ఆయన మంగళవారం రాత్రి హూటాహూటిన కోయంబత్తూరు నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులతో ఆయన చర్చించనున్నారు. జరిగిన పరిగణమాలపై ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ ఆయన భేటీ అయి వివరణ ఇవ్వనన్నట్లు సమాచారం.

Updated Date - 2023-09-27T07:25:32+05:30 IST