Congress: లోక్‌సభ నుంచి రాహుల్‌ను బహిష్కరించే ప్లాన్‌లో బీజేపీ

ABN , First Publish Date - 2023-03-17T22:30:45+05:30 IST

రాహుల్‌ను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని అనుమానం వ్యక్తం చేసింది.

Congress: లోక్‌సభ నుంచి రాహుల్‌ను బహిష్కరించే ప్లాన్‌లో బీజేపీ
Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) విదేశీగడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్(Congress) కొత్త అనుమానం వ్యక్తం చేసింది. రాహుల్‌ను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. అదానీ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బీజేపీ ఇలా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్( Congress general secretary KC Venugopal) ఆరోపించారు.

మరోవైపు లండన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP chief JP Nadda) మరోసారి తప్పుబట్టారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ అని నడ్డా చురకలు వేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ(Chitradurga, Karnataka)లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన రాహుల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.

అదానీ అంశంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు, విదేశీగడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు చేస్తోన్న వాదనలతో 6 రోజులుగా పార్లమెంట్ దద్దరిల్లిపోతోంది. గందరగోళంతో ఉభయసభలూ వాయిదా పడుతూ వస్తున్నాయి.

150 రోజుల పాటు దేశంలోని 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 4 వేల కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఆ తరువాత విదేశాలకు వెళ్లారు. బాగా పెరిగిన గడ్డాన్ని ట్రిమ్ చేసుకుని లండన్‌లో దర్శనమిచ్చారు. అక్కడి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University)లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశ ప్రజాస్వామ్యంపై, న్యాయ వ్యవస్థపై ఆయన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ప్రజాస్వామిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆరోపించారు కూడా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

Updated Date - 2023-03-17T22:30:49+05:30 IST