BJP: బీజేపీ ఇన్‌చార్జిగా సీటీ రవి కొనసాగుతారా?
ABN , First Publish Date - 2023-07-30T07:57:02+05:30 IST
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి(CT Ravi)పై వేటు పడడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశ మైం
- బీజేపీ ప్రధాన కార్యదర్శిగా తొలగింపుతో చర్చ
అడయార్(చెన్నై): బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి(CT Ravi)పై వేటు పడడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశ మైంది. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయన్ని తొలగిస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) చేపట్టిన పాదయాత్రలో ఉన్న సమయంలోనే ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించడం గమనార్హం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీటీ రవి.. శుక్రవారం వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, టీఎన్ ఇన్‌చార్జిగా కొనసాగుతూ వచ్చారు. శుక్రవారం నాడు కేంద్ర హోంమత్రి అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి కె.అన్నామలై చేపట్టిన పాదయాత్రను స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభ వేదికపై కూడా ఆయన ఆశీనులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను జాతీయ కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఉత్తర్వులు జారీ చేశారు. అన్నామలై పాదయాత్రలో ఉన్న సమయంలోనే సీటీ రవిని జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఈ ఆకస్మిక మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమిళనాడు ఇన్‌చార్జిగా సీటీ రవి కొనసాగుతారా లేదా? అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.