2024 General polls: బీజేపీ-అకాలీదళ్ మళ్లీ చెట్టాపట్టాల్..?
ABN , First Publish Date - 2023-07-05T15:43:55+05:30 IST
పంజాబ్ లో మళ్లీ పాత మిత్రుల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తుండటంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దూరమైన బీజేపీ, అకాలీదళ్ తిరిగి పంజాబ్‌లో పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. పొత్తు కోసం సాద్‌తో బీజేపీ మంతనాలు సాగిస్తోంది.
న్యూఢిల్లీ: పంజాబ్ (Punjab)లో మళ్లీ పాత మిత్రుల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు (2024 General Polls) తరుముకొస్తుండటంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దూరమైన బీజేపీ, అకాలీదళ్ (BJP-Akali Dal) తిరిగి పంజాబ్‌లో పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం మళ్లీ మూడోసారి అకాలీదళ్‌తో కలిసి పనిచేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఇందుకోసం శిరోమణి అకాలీదళ్ (SAD)తో మంతనాలు సాగిస్తోంది. పంజాబ్‌లో సీట్ల షేరింగ్ ఆధారంగా పొత్తుకు మంతనాలు సాగిస్తోంది.
కేంద్ర తీసుకువచ్చిన సాగుచట్టాల సమయంలో రైతులు తీవ్ర నిరసనల మధ్య బీజేపీతో పొత్తును శిరోమణి అకాలీదళ్ అప్పట్లో ఉపసంహరించుకుంది. ఆ తర్వాత సాగుచట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పంజాబ్‌లో ఓటమి చవిచూసింది. ఈక్రమంలో ఇరుపార్టీలు మళ్లీ పొత్తుకు సిద్ధమవుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నారు. దివంగత ప్రకాష్ సింగ్ బాదల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనను సౌభ్రాతృత్వానికి అధిపతిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఏప్రిల్ 26న ఛండీగఢ్ వెళ్లి బాదల్‌కు నివాళులర్పించారు.
సాద్ కీలక సమావేశం 6న
కాగా, ఈనెల 6వ తేదీన పార్టీ కీలక సమావేశాన్ని సాద్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్ ఛండీగఢ్‌లో ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, జతేదార్లు ఇందులో పాల్గోనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
పడిపోతున్న సాద్ గ్రాఫ్...
'సాద్' రాజకీయ గ్రాఫ్ 2017 నుంచి కిందకు పడిపోతోంది. పంజాబ్‌లో ప్రధాన విపక్ష పార్టీగా చోటు కూడా దక్కించుకోలేకపోతోంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించగా, సాద్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షంలోకి వచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సాద్ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం పంజాబ్‌లో సాద్‌కు రెండు పార్లమెంటరీ సీట్లు మాత్రమే ఉన్నాయి. సుఖ్‌బీర్ బాదల్, ఆయన భార్య హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాద్-బీజేపీ పొత్తు ఉభయ పార్టీలకు ప్రయోజనకారిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది.