BS Yeddyurappa: ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన యడ్డీపై బీజేపీకి అమాంతం పెరిగిన ప్రేమ.. అసలు విషయం ఇదన్నమాట..!
ABN , First Publish Date - 2023-03-03T10:34:59+05:30 IST
ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన యడ్డీపై బీజేపీ(BJP)కి అమాంతం ప్రేమ పెరిగిపోయిది. శాసనసభకు త్వరలో జరిగే ఎన్నికల్లో అత్యంతక కీలకమైన
* అప్పకు అందలం
* యడ్డీకి అమాంతం పెరిగిన ప్రాధాన్యం
* లింగాయత్ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు
* సర్వేలతో అధిష్టానానికి మొదలైన వణుకు
* యడియూరప్ప లేకపోతే భారీగా ఓట్లు చీలే అవకాశం
* పార్టీ ఎన్నికల ప్రచార సమితి అధ్యక్షుడిగా ఆయనకే బాధ్యతలు..?
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన యడ్డీపై బీజేపీ(BJP)కి అమాంతం ప్రేమ పెరిగిపోయిది. శాసనసభకు త్వరలో జరిగే ఎన్నికల్లో అత్యంతక కీలకమైన లింగాయత్ కులస్థుల ఓటుబ్యాంకును కాపాడుకోవడం బీజేపీకి అగ్నిపరీక్షగా మారనుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కన్నడ నాట బీజేపీ(BJP)లో జవసత్వాలు నింపి అధికారపీఠానికి చేరువ చేయడంలో ప్రముఖ లింగాయత్ నేత బీఎస్ యడియూరప్ప(BS Yeddyurappa) కీలక పాత్ర పోషించారు. ఫలితంగా ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి(Chief Minister) పదవిని అధిష్టించగలిగారు. వయోభారాన్ని కారణంగా చూపి పార్టీ అధిష్టానం యడియూరప్పను సీఎం పదవిని నుంచి సాగనంపి ఆ స్థానంలో మరో లింగాయత్ నేత బసవరాజ బొమ్మైను కూర్చోబెట్టింది. పాలనాపరంగా సమర్థతను బాగానే చాటుకోగలిగినా యడియూరప్ప స్థానాన్ని మాత్రం బొమ్మై భర్తీచేయలేకపోయారు. బొమ్మై నాయత్వంలో ఎన్నికలకు వెళ్తే పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం కష్టమని క్షేత్ర స్థాయినుంచి వచ్చిన సర్వేలు బీజేపీకి నిద్రలేకుండా చేశాయి. అందుకే యడియూరప్పకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను కల్పిస్తూ వస్తున్నారు.
జాతీయ స్థాయిలో అత్యున్నతమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఆయనను నియమించారు. ఇదే హోదాలో ఆయన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ ఉంటారు. అంతేకాగా యడియూరప్ప రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు విజయేంద్రకు కూడా ప్రాధాన్యతను పెంచుతూ వచ్చారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయనను పార్టీ అనుబంధంగా ఉండే అన్ని మోర్చాలకు కన్వీనర్ గా నియమించారు. తద్వారా లింగాయత్‌లలో నెలకొని ఉన్న అసంతృప్తిని చల్లార్చాలని లింగాయత్ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా చూసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. అయితే యడియూరప్పను రాజకీయంగా వాడుకుని వదిలేశారని ఆయనకు తీరని అన్యాయం చేశారని భావిస్తున్న లింగాయత్ కులంలోని మరో వర్గం మాత్రం బీజేపీకి ఈసారి మద్దతునివ్వడం అనుమానమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సహజంగానే ఈసారి లింగాయత్ ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడే అవకాశాలు చాలా తక్కువంటూ వస్తున్న సర్వేలు బీజేపీకి కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. పైగా లింగాయత్ ఓట్లపై కాంగ్రెస్ కూడా కన్నేయడం పార్టీ రాష్ట్ర ప్రచార సమితి పగ్గాలు ఏకంగా లింగాయత్ నేత, మాజీ మంత్రి ఎంబీ పాటిల్(Former minister MB Patil)కు అప్పగించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆనక త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో లింగాయత్ కులస్థులకు సాధ్యమైనన్ని ఎక్కువ టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ తీర్మానించినట్లు తెలుస్తోంది.
అమాంతం పెరిగిన అప్ప ప్రాధాన్యం
లింగాయత్ ఓటు బ్యాంకుకు చిల్లు పడిందన్న సర్వేలతో బీజేపీ అధిష్ఠానం పెద్దలు అప్రమత్తమయ్యారు. దక్షిణాదిన కన్నడ నాట అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఒక వేళ కర్ణాటక తమ చేజారితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతామని కమలనాథులు భయపడుతున్నారు. పైగా కర్ణాటకలో పూర్తి మెజార్టీతో అధికారంలో వస్తే దాని ప్రభావం 2024లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తెలంగాణాపై కూడా ఉంటుందని బీజేపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. అందుకే కర్ణాటక(Karnataka)లో గెలిచి తీరాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకు చక్కటి సోపానంగా ఉన్న లింగాయత్‌లను ఎట్టిపరిస్థితిలోనూ దూరం చేసుకోరాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అప్ప ప్రాధాన్యత అమాంతం పెరగడానికి ఇదే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అప్ప విషయంలో అధిష్టానం పెద్దల స్వరం కూడా మారుతూ వచ్చింది. ఆరు నెలల క్రితం బొమ్మై నాయకత్వంలోనే ఎన్నికలు అని ఘంటాపథంగా ప్రకటించిన నేతలు ఆపై స్వరం కాస్త మార్చి సమిష్టి నాయత్వంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) పేరిట ఎన్నికలకు సంకేతాలు పంపారు. ఇప్పుడు పరిస్ధితి అనూహ్యంగా మారిపోయింది. యడియూరప్ప సేవలను రాష్ట్ర స్థాయిలో పార్టీకోసం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ అధిష్ఠానం పెద్దలు నిర్ణయించారు. శివమొగ్గ(Shivamogga) విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై ప్రధాని స్వయంగా యడియూరప్పను అక్కున చేర్చుకున్నంత పనిచేశారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. యడియూరప్ప కూడా పార్టీ తనకు ఇస్తున్న అపూర్వ ప్రాధాన్యతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.... రిజర్వేషన్‌ల కోసం గట్టిపట్టుతో ఉన్న పంచమసాలి లింగాయత్‌ల ఆక్రోశం లోలోపల బీజేపీ నేతలను భయపెడుతూనే ఉంది.