రేపే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?, పలువురిపై వేటు.. కొత్త ముఖాలకు చోటు
ABN , First Publish Date - 2023-05-09T08:27:42+05:30 IST
అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్య్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారమే ఇందుకు కారణమైంది.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే నేతల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్య్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారమే ఇందుకు కారణమైంది. రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగిడిన డీఎంకే(DMK) ప్రభుత్వ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయంటూ ఆ పార్టీ అధిష్టానం నుంచి వెలువడుతున్న లీకులు.. ఆ నేతల్లో టెన్షన్ రేపుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరి పదవి ఊడుతుందో, ఎవరికి కొత్త పదవి వచ్చి పడుతుందోన్న ఉత్కంఠ ఆ పార్టీ ఎమ్మెల్యేలను నిలువనీయడం లేదు. కొంతమంది మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇంకొంతమంది పార్టీ అధిష్ఠానం పట్ల విశ్వసనీయత చూపకపోవడం, మరికొంతమంది నిర్లక్ష్య పనితీరు కారణంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తాను విదేశీ పర్యటనకు వెళ్తుండడంతో ఈలోపే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని స్టాలిన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆయన ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. బుధ, గురువారాల్లో శుభముహూర్తాలు ఉండడంతో ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు మంత్రివర్గం చేపట్టే అవకాశముందని సచివాలయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. అయితే బుధవారం నాడే సీఎం ముహూర్తం ఖరారు చేశారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. కాగా వేటు పడేదెవరిపైన అన్నదానిపై డీఎంకేలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్థికశాఖ మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్‌పై వేటు పడడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలుగా ప్రచారంలో వున్న ఆడియో కారణంగా డీఎంకే వర్గాలు ఇరుకున పడినట్లయింది. ఆ ఆడియోను ఆధారం చేసుకుని బీజేపీ, అన్నాడీఎంకే(BJP, AIADMK) నేతలు డీఎంకేపై విమర్శలు సంధించారు. దీని పట్ల పళనివేల్ త్యాగరాజన్ నేరుగా సీఎం నివాసానికి వెళ్లి వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎం సైతం త్యాగరాజన్ వివరణ పట్ల సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందుకే ఆయనకు పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గించినట్లు డీఎంకే(DMK) వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనపై వాడవాడలా ప్రచారం చేపడుతుండగా, ఇందులో పళనివేల్ త్యాగరాజన్ పేరు లేకుండాపోయింది. మంత్రులందరి పేర్లుండగా, ఆయన పేరు మాత్రమే ఈ జాబితా నుంచి తొలగించడంతో ఆయన మంత్రి పదవిపైనా వేటు పడడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా పాడిపరిశ్రమల శాఖ మంత్రి ఆవడి నాజర్, ఆదిద్రావిడ సంక్షేమ శాఖ మంత్రి కయల్‌విళి సెల్వరాజ్, పర్యాటకశాఖ మంత్రి కె.రామచంద్రన్ పనితీరుపట్ల కూడా సీఎం అసంతృప్తిగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో కొంతమంది శాఖల్ని మార్చనుండగా, మరికొంతమందిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కూడా సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బుధవారం ఏం జరుగనుందోనన్న ఉత్కంఠ డీఎంకే ఎమ్మెల్యేల్లో నెలకొంది. అవకాశం వుంటే తమ పేరు పరిశీలించాలంటూ ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం స్టాలిన్, మంత్రి ఉదయనిధి(CM Stalin, Minister Udayanidhi) తదితరులకు విన్నవించుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సారి ఉదయనిధికి సన్నిహితులైన కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటివ్వాలని సీఎం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా వుండగా రెండేళ్ల డీఎంకే పాలనలో ఇప్పటికే రెండుమార్లు మంత్రివర్గంలో మార్పులు జరిగాయి. దళిత వర్గాల ను కించపరిచారనే ఆరోపణలు ఎదుర్కొన్న రవాణాశాఖ మంత్రి రాజకన్నప్పన్‌ను గత 2022 మార్చి 29న ఆ శాఖ నుంచి తప్పించి, బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. ఆ పదవిలో వున్న ఎస్‌ఎస్ శివశంకరన్‌ను ప్రభుత్వ రవాణాశాఖకు బదిలీ చేశారు. ఆ తరువాత గతేడాది డిసెంబరు 14వ తేదీన మంత్రిగా ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. చేశారు. ఆయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధిశాఖ ఇచ్చారు. అయితే అప్పుడు మంత్రులెవ్వరినీ తొలగించలేదు. కేవలం ఐ.పెరియస్వామి, ఎస్.ముత్తుస్వామి, పెరియ కరుప్పున్, రాజకన్నప్పన్, కె.రామచంద్రన్, గాంధీ, పీకే శేఖర్‌బాబు, పళనివేల్ త్యాగరాజన్, మెయ్యనాథన్, మదివేందన్‌ల శాఖలు మాత్రమే మారాయి. ప్రస్తుతం కొందరిపై వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. పనితీరు సరిగ్గాలేని మంత్రులను కూడా పక్కనబెట్టడం ఖాయమని తెలుస్తోంది.