Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

ABN , First Publish Date - 2023-08-23T18:59:43+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో..

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో.. చంద్రుడి ఉపరితలం తాకిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అంతేకాదు.. చంద్రుడి దక్షిణ ధృవంలో ఈ రోవర్ ల్యాండ్ అవ్వడంతో.. ఈ ఘనత సాధించిన తొలి దేశంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎందుకంటే.. ఇంతవరకు ఏ దేశమూ ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయలేదు.

ఈ సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని జోహన్నస్‌బర్గ్‌లో ఉన్న ఆయన.. అక్కడి నుంచే ఈ ప్రయోగాన్ని లైవ్‌లో వీక్షించారు. అనంతరం ప్రసంగిస్తూ.. చంద్రయాన్-3 ఘనవిజయవంతో తన జీవితం ధన్యమైందని, ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టమని పేర్కొన్నారు. ఈ క్షణం కోసం తనతో పాటు 140 కోట్ల మంది ఎదురు చూశారని.. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు చెప్పారు. అమృతకాలంలో ఇది తొలి ఘనవిజయమని కొనియాడారు.


ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ మాధ్యమంగా ఇస్రోకి అభినందనలు తెలిపారు. చంద్రుడిపైకి భారత్ చేరిందని, ఈరోజు మనమంతా చరిత్ర సృష్టించామని అన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని, ఈ ఘనతను సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించిందని కొనియాడారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని చంద్రునిపైకి, వెలుపలకు తీసుకెళ్లాలనే వారి అచంచలమైన స్ఫూర్తిని, సంకల్పానికి నేను వందనం చేస్తున్నానన్నారు. భారతదేశం అనంత యుగం ప్రారంభంలో ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ట్వీట్ చేస్తూ.. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయినందుకు భారత పౌరుడిగా గర్వంగా ఉందన్నారు. ఇస్రోకు తన శుభాకాంక్షలు తెలిపన ఆయన.. ఈ అపురూపమైన ఘనతకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక అవ్వడం మరింత ప్రత్యేకమన్నారు. అటు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని కొన్ని రోజులుగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌కి ఇదొక గొప్ప విజయమని, చంద్రయాన్-3 అద్భుతమైన సక్సెస్ సాధించిందని, ఈరోజు మనం చరిత్ర సృష్టించామని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. భారతీయులందరూ గర్వించదగిన ఈ సంబరాల్లో తానూ చేరానని, రాబోయే రోజుల్లో మరిన్ని శాస్త్రీయ మిషన్లకు ఇది మార్గం సుగుమం చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. అలాగే.. దర్శకధీరుడు రాజమౌళి సైతం తన మనసు గర్వంతో ఉప్పొంగుతోందని, ఆనంద భాష్పాలు వస్తున్నాయని ట్వీటారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఇస్రో అధికారులకు సెల్యూట్ చేశారు.

చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండ్ అయినందుకు ఇస్రోకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీరే మా ప్రైడ్ అంటూ తారక్ ట్వీట్ చేశాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం.. ఈ రిమార్కబుల్ విజయం సాధించినందుకు గాను ఇస్రోకి కాంగ్రాట్స్ తెలిపారు. ఇంకా కళ్యాణ్ రామ్, మంచు విష్ణులతో పాటు మరెందరో శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ఖ్యాతిని ఇస్రో ప్రపంచానికి చాటి చెప్తోందని.. మహిళలు & పురుషులు కలిసి సవాళ్లను ఎదుర్కొని, ఎంతో కష్టపడి త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

కాంగ్రెస్ పార్టీ సైతం చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ఇస్రోతో సహా దేశప్రజలందరికీ అభినందనలను తెలిపింది. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలు అవసరమని భావించి పండిట్ నెహ్రూ ఇస్రోకు పునాది వేశారని.. ఆయన దూరదృష్టి ఫలితమే నేడు భారతదేశం మొత్తం ప్రపంచంలోనే అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోందని ట్వీట్ చేసింది.

Updated Date - 2023-08-23T19:09:44+05:30 IST