Covid Restrictions : కోవిడ్ నిబంధనలపై కేంద్రం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-10T18:44:28+05:30 IST

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం అమలు చేస్తున్న

Covid Restrictions : కోవిడ్ నిబంధనలపై కేంద్రం కీలక నిర్ణయం
International Passengers

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం అమలు చేస్తున్న నిబంధనలను సడలించింది. చైనాతోపాటు మరికొన్ని దేశాల నుంచి భారత దేశానికి వచ్చే ప్రయాణికులు తాము బయల్దేరడానికి ముందు కోవిడ్-19 పరీక్ష చేయించుకోవలసిన, సెల్ఫ్ హెల్త్ డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయవలసిన అవసరం లేదని తెలిపింది. అయితే భారత దేశానికి వచ్చే ప్రయాణికుల్లో రెండు శాతం మందికి కోవిడ్ పరీక్షలు చేయాలనే నిబంధన కొనసాగుతుందని పేర్కొంది.

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం తాజా మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చైనా, సింగపూర్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, జపాన్ నుంచి/మీదుగా భారత దేశానికి వచ్చే ప్రయాణికులు తాము బయల్దేరడానికి ముందు కోవిడ్-19 పరీక్ష చేయించుకోనక్కర్లేదని తెలిపింది. అదేవిధంగా సెల్ఫ్ హెల్త్ డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయనక్కర్లేదని పేర్కొంది. అయితే భారత దేశానికి వచ్చే ప్రయాణికుల్లో రెండు శాతం మందికి కోవిడ్ పరీక్షలు చేయాలనే నిబంధన కొనసాగుతుందని పేర్కొంది. ఈ మార్గదర్శకాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించింది. ఈ మార్గదర్శకాలు ఈ నెల 13 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమలవుతాయని తెలిపింది.

గడచిన నాలుగు వారాల్లో ఈ దేశాల్లో కోవిడ్-19 కేసులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదిక కూడా గడచిన 28 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా, అంతకుముందు 28 రోజులతో పోల్చుకుంటే, కోవిడ్-19 నిర్థరిత కేసుల సంఖ్య 89 శాతం తగ్గినట్లు చెప్తోందని పేర్కొంది.

Updated Date - 2023-02-10T18:44:32+05:30 IST