Chandrababu Naidu: చెన్నైలో చంద్రబాబుకు నీరాజనం..
ABN , First Publish Date - 2023-12-13T11:01:54+05:30 IST
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నగరంలో అభిమానులు, ఆ పార్టీ మద్దతుదారులు

- విమానాశ్రయం వద్ద టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నగరంలో అభిమానులు, ఆ పార్టీ మద్దతుదారులు నీరాజనం పలికారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్(Hyderabad) నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు చెన్నై విమానాశ్రయం(Chennai Airport) చేరుకున్నారు. అక్కడ టీడీపీ చెన్నై అధ్యక్షుడు చంద్రశేఖర్, టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ, ఆస్కా మాజీ అధ్యక్షుడు ఎం.ఆదిశేషయ్య, కెన్సెస్ సంస్థల సీఈవో ఎం.కృష్ణ, ‘ఏంజెల్స్’ అధినేత సురేష్, తెలుగు ప్రముఖులు బ్రహ్మానందం, చలపతి, రాజేష్, సీనియర్ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, నారాయణ, టీడీపీ నేతలు గాలి భానుప్రకాష్, డాక్టర్ థామస్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, యువకులు ‘‘జై చంద్రబాబు - జైజై చంద్రబాబు, సీఎం సీఎం, సైకిల్ రావాలి-సైకో పోవాలి’’ అంటూ.. పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతేగాక ఆయన వాహనంపై పూల వర్షం కురిపించారు. అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ బయలుదేరిన చంద్రబాబు స్థానిక శ్రీపెరుంబదూర్‌లోని రామానుజ ఆదికేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అన్నానగర్ ఎమ్మెల్యే మోహన్, సినీ నిర్మాత సి.కల్యాణ్ తదితరులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడారు. అనంతరం స్థానిక మైలాపూర్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విమానాశ్రయం చేరుకుని, రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.