Chennai: అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. విక్రయాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-10-06T10:26:18+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముద్రించిన 2024 ఏడాది డైరీలు, క్యాలెండర్లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి.
- 15 నుంచి శ్రీవారి బ్రహోత్సవాలు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముద్రించిన 2024 ఏడాది డైరీలు, క్యాలెండర్లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల టీటీడీ సమాచారకేంద్రం సలహామండలి చైర్మన్ ఏజే శేఖర్(AJ Shekhar) గురువారం వీటిని ఆవిష్కరించారు. తొలిగా టి.నగర్, వెంకటనారాయణరోడ్డులో వున్న శ్రీవారి ఆలయంలో, అనంతరం జీఎన్ చెట్టి రోడ్డులో వున్న పద్మావతి అమ్మవారి ఆలయంలో డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించి, విక్రయాలను ప్రారంభించారు. ఇదిలా వుండగా డైరీ రూ.150, 12 షీట్ల క్యాలెండర్ రూ.130, 12 షీట్ల తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30గా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. వాటిని బల్కుగా కూడా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజే శేఖర్‌తో పాటు సలహామండలి మాజీ సభ్యులు ఆనందకుమార్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పీవీ కష్ణారావు, కార్తికేయన్, యువరాజ్, అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
9న పవిత్రోత్సవం: ఈ నెల 9వ తేదీ నుంచి స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. అదే విధంగా ఈ నెల 15 తేదీ సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా తొలిరోజున శేష వాహనం, 16న హంసవాహనం, 17న ముత్యపు పందిరి, 18న కల్పవృక్షం, 19న గరుడ వాహనం, 20వ తేదీ ఉదయం హనుమంత, సాయంత్రం గజ వాహనం, 21వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ, 22న అశ్వవాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. 23వ తేదీ ఉదయం చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనుండగా, సాయంత్రం పట్టాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుమలలో జరుగుతున్న తరహాలోనే టి.నగర్ ఆలయంలోనూ అన్ని రకాల కైంకర్యాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా తిరుమల తరహాలోనే యధాతథంగా నిర్వహించనున్నారు.