మహిళలకు సురక్షిత నగరం ‘చెన్నై’.. , ఈ మాట అన్నది ఎవరంటే...
ABN , First Publish Date - 2023-04-21T13:27:00+05:30 IST
దేశంలోనే మహిళలకు సురక్షిత నగరంగా చెన్నై పేరు గడిస్తోందని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలని
చెన్నై, (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మహిళలకు సురక్షిత నగరంగా చెన్నై పేరు గడిస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. శాసనసభలో గురువారం ఉదయం పోలీసుశాఖ ఆర్థిక పద్దుల ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖను కూడా నిర్వర్తిస్తున్న ఆయన ప్రసంగిస్తూ.. మహిళకు రక్షణ కలిగిన నగరం చెన్నై నగరమేనంటూ జాతీయ నేరాల రికార్డుల నమోదు సంస్థ అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. నగరానికి చెందిన పోలీసు సర్కిల్‌లో 102 స్థానిక పోలీసుస్టేషన్లు, 37 మహిళా పోలీసుస్టేషన్లు, 58 ట్రాఫిక్ విభాగం పోలీసుస్టేషన్లు ఉన్నాయని, అంతేకాకుండా ఐదుగురు అదనపు పోలీసు కమిషనర్లు, ఏడుగురు డిప్యూటీ పోలీసు కమిషనర్లు, 31 మంది అసిస్టెంట్ పోలీసు కుమిషనర్లు ప్రజలకు నిర్విరామ సేవలందిస్తున్నారని చెప్పారు. పోలీసు శాఖలో తప్పిదాలకు పాల్పడినవారినే తమ ప్రభుత్వం బదిలీలు చేసి శాఖాపరమైన చర్యలు చేపడుతున్నదే తప్ప రాజకీయపరంగా వారిని బదిలీలు చేయడం లేదన్నారు. అన్నాడీఎంకే సభ్యుడు పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ పోలీసుశాఖ రాజకీయపరమైన బదిలీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎక్కడైనా రాజకీయ కారణాలతో పోలీసులను బదిలీ చేసి వుంటే అన్నాడీఎంకే సభ్యులు ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
నగరంలో వీపీ సింగ్ విగ్రహం
రాజధాని నగరం చెన్నైలో భారత మాజీ ప్రధాని వీపీ సింగ్‌కు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం శాసనసభలో సభానిబంధన 110 కింద ఆయన ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ద్రావిడ తరహా పాలనను అందిస్తున్న తమ ప్రభుత్వం వీపీసింగ్ దేశంలో సామాజిక న్యాయాన్ని ఎలుగెత్తి చాటేలా అందించిన సేవలను స్మరించుకునేలా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.భూదాన ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని, తన భూములను సైతం దానంగా ఇచ్చారని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని, 1989లో నేషనల్ ఫ్రంట్‌ను ప్రారంభించి దేశ ప్రధానిగా ఉన్నతస్థితికి చేరుకున్నారని చెప్పారు. 11 నెలలపాటు ఆయన ప్రధానిగా చేసిన సేవలను ఎవరూ మరచిపోలేరని అన్నారు. వెనుకబడిన తరగతుల వారికి వారి జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించాలన్న ధ్యేయంతో బీపీ మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి విద్య తదితర రంగాలలో వారికి రాయితీలు కల్పించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వు జారీచేసి సామాజిక న్యాయ సంరక్షకుడిగా పేరుతెచ్చుకున్నారని చెప్పారు. వీపీ సింగ్‌కు మాజీ ముఖ్యమంత్రి కరుణాధికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవని, నగరంలో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి తానే నాయకత్వం వహించానని చెప్పారు. భారత దేశంలో నవశకానికి నాంది పలికిన ఆ ధీరోదాత్తుడికి చెన్నై నగరంలో నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పనున్నామని స్టాలిన్ ప్రకటించారు.
ఇదికూడా చదవండి: ‘తొమ్మిది’లో కలైంజర్ జీవిత చరిత్ర