Chennai: ప్రమాద బాధితుల రక్షణ కోసం రోడ్డెక్కిన ‘వీర’
ABN , First Publish Date - 2023-09-09T07:48:08+05:30 IST
చెన్నై మహానగర ట్రాఫిక్ విభాగం పోలీసుల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో కాపాడేందుకు ప్రత్యేకంగా
- దేశంలోనే తొలిసారిగా రంగప్రవేశం
- ప్రారంభించిన సీఎం స్టాలిన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై మహానగర ట్రాఫిక్ విభాగం పోలీసుల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో కాపాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘వీర’ (వెహికల్ ఫర్ ఎక్స్‌ట్రాక్షన్ ఇన్ ఎమర్జెన్సీ రెస్క్యూ అండ్ యాక్సిడెంట్స్) వాహనాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో కాపాడి ఆసుపత్రికి తరలించేందుకు, వాహనాల శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని వెలికి తీయడానికి అనువుగా ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వాహనంలో ప్రమాద బాధితులను కాపాడటంలో సునిశిత శిక్షణ, నైపుణ్యం కలిగిన పోలీసు సభ్యులు సేవలందించనున్నారు. ఈ ప్రత్యేక రక్షణ వాహనం రూపకల్పనలో హ్యుండాయ్ గ్లోవిస్, ఇక్సూచూ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, రాష్ట్ర హైవేస్ శాఖ, మద్రాస్ ఇండియా టెక్నికల్ కార్పొరేషన్, ఐఐటీ మద్రాస్ తదితర సంస్థలు సహకరించాయి. ఈ వాహనంలో రోడ్డు ప్రమాదంలో వాహనాల శిథిలాల నుంచి క్షతగాత్రులను వెలికి తీసేందుకు అవసరమైన ఎనిమిది రకాల సాంకేతిక పరికరాలు, పనిముట్లు ఉన్నాయి. రంథ్రాలు వేసే చిన్న యంత్రాలు, రేకుల కత్తెరలు, రేకులను కోసే రంపాలు, ఎలక్ర్టిక్ వించ్‌లు, వాహనాన్ని పైకి లేపే పరికరం తదితరాలు కూడా ఉన్నాయి. ఈ వాహన సేవ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, హోంశాఖ కార్యదర్శి పి. అముదా, డీజీపీ శంకర్‌జివాల్, గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ సందీప్‌రాయ్ రాథోడ్ తదితరులు కూడా పాల్గొన్నారు.