Share News

Bhupesh Baghel nomination: నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2023-10-30T14:37:41+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోమవారంనాడు పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇదే సీటు నుంచి ఆయన ఐదుసార్లు 1993, 1998, 2003, 2013, 2018లో గెలుపొందారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి, తన మేనల్లుడు విజయ్ బఘెల్ చేతిలో ఓటమి చవిచూశారు.

Bhupesh Baghel nomination: నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి

రాయపూర్: కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ (Chattisgarh) ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) సోమవారంనాడు పటాన్ (Patan) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇదే సీటు నుంచి ఆయన ఐదుసార్లు 1993, 1998, 2003, 2013, 2018లో గెలుపొందారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి, తన మేనల్లుడు విజయ్ బఘెల్ చేతిలో ఓటమి చవిచూశారు. 62 ఏళ్ల బఘెల్ తాజాగా తన నామినేషన్ పేపర్లను దుర్గ్ కలెక్టరేట్‌లో సమర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట అసెంబ్లీ స్పీకర్ చరణ్ దాస్ మహంత, రాష్ట్ర హోం మంత్రి తామ్రధ్వజ్ సాహు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ మహతరి (మదర్ ఛత్తీస్‌గఢ్) ఆశీస్సులతో పటాన్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఈ రోజు నామినేషన్ పత్రం దాఖలు చేశానని, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని సీఎం తన ట్వీట్‌లో తెలిపారు. నామినేషన్ వేయడానికి ముందు బఘెల్‌ భార్య ఆయనకు తిలకం దిద్దారు. ఆ ఫోటోను కూడా బఘెల్ ట్వీట్ చేశారు.


కాగా, దుర్గ్ నుంచి ప్రస్తుతం లోక్‌సభ సభ్యునిగా ఉన్న విజయ్ బఘెల్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ ఇరువురు నేతలు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు కావడం, నియోజకవర్గంలో ఓబీసీ కమ్యూనిటీ ఓటర్లు గణనీయంగా ఉండటం విశేషం. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగనుంది. నవంబర్ 7న 20 స్థానాల్లో తొలి విడత పోలింగ్, నవంబర్ 17న తక్కిన 70 స్థానాల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-10-30T14:37:41+05:30 IST