Chhattisgarh: నామినేషన్ వేసిన హ్యాట్రిక్ సీఎం, గెలుపుపై ధీమా
ABN , First Publish Date - 2023-10-16T17:50:11+05:30 IST
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. బీజేపీ సీనియర్ నేత, మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ సోమవారంనాడు రాజ్‌నంద్‌గావ్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
రాజ్‌నందగావ్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. బీజేపీ సీనియర్ నేత, మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ (Raman Singh) సోమవారంనాడు రాజ్‌నంద్‌గావ్ (Rajnandgaon)లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గీతా ఘసి సాహు (ఖుజ్జి సీటు), భరత్ లాల్ వర్మ (డోంగర్‌గావ్), వినోద్ ఖండేకర్ (డోంగర్‌ఘడ్-ఎస్సీ రిజర్వ్‌డ్) నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరయ్యారు.
బీజేపీదే గెలుపు..
నామినేషన్ల దాఖలు అనంతరం రమణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు తాను నామినేషన్ పత్రాలు సమర్పించానని, అమిత్‌షా స్వయంగా ఆశీస్సులు అందించడం తమ అదృష్టమని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని విజయం వరించనుందని, ప్రజలు కూడా ఉత్సుకతతో ఉన్నారని చెప్పారు. రమణ్ సింగ్ సంప్రదాయబద్ధంగా పోటీ చేస్తూ వస్తున్న రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గం నుంచే ఈసారి కూడా బరిలో ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు (2008, 2013, 2018) ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రమణ్ సింగ్‌కు పోటీ ఎవరంటే..?
ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతను బరిలోకి దింపింది. ఛత్తీస్‌గఢ్ మినెరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న గిరీష్ దేవాంగన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.
రెండు విడతలుగా..
ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ రెండు విడతలుగా జరగనుంది. నవంబర్ 7న 20 స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరుగనుంది. రెండో విడతగా నవంబర్ 17 తక్కిన 70 సీట్లకు పోలింగ్ ఉంటుంది. ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కాలపరిమితి 2024 జనవరి 3తో ముగియనుంది.
గత ఎన్నికల్లో...
ఛత్తీస్‌గఢ్‌లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుంది. బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. దివంగత అజిత్ జోగి స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) 5 సీట్లు గెలుచుకోగా, ఆ పార్టీ భాగస్వామి బీఎస్‌పీ 2 సీట్లు సాధించింది.