AAP Guarantees:10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
ABN , First Publish Date - 2023-08-19T19:54:52+05:30 IST
ఛత్తీస్‌గఢ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ వరాల జల్లులు కురిపించింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. పలు హామీలతో కూడిన గ్యారెంటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరాల జల్లులు కురిపించింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, 300 యూనిట్ల వరకూ గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ఆప్ వాగ్దానం చేసింది. పలు హామీలతో కూడిన ''గ్యారెంటీ కార్డు''ను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విడుదల చేశారు. ఒక రోజు పర్యటన కోసం శనివారంనాడు రాయ్‌పూర్ వచ్చిన కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తల సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. గత ఐదు నెలలో రాష్ట్రంలో కేజ్రీవాల్ పర్యటించడం ఇది మూడోసారి.
'ఆప్' హామీలివే...
-నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పన.
-ఉద్యోగం వచ్చేంత వరకూ నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
-10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు.
-ఉద్యోగ నియామకాల్లో సిఫారసులు, అవినీతికి తావులేని పారదర్శక విధానం అమలు.
-ప్రతి నెల 300 యూనిట్ల వరకూ గృహావసరాలకు వినియోగించే విద్యుత్ ఉచితం.
-అన్ని గ్రామాలు, సిటీల్లో కరెంటు కోతల్లేని నిరంతరాయ విద్యుత్ సరఫరా.
-ఆప్ అధికారంలోకి రాగానే గృహాసరాల కోసం వినియోగించే విద్యుత్ బిల్లుల బకాయిలు మాఫీ.
-18 ఏళ్ల పైబడిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1000 ఆర్థిక సాయం.
-పిల్లలందరికీ ఉచిత విద్య
-ఢిల్లీ తరహాలో ప్రభుత్వ పాఠశాలను అత్యున్నతంగా తీర్చిదిద్దడం.
-ఇష్టారీతిన ప్రైవేటు పాఠశాలలు ఫీజులను పెంచకుండా నియంత్రించడం.
-కాంట్రాక్టు టీచర్ల సర్వీసును క్రమబద్ధం చేయడం. ఖాళీ టీచర్ల పోస్టులు భర్తీ.
-టీచర్లకు పాఠ్యాంశాలు బోధించడం ఇతరత్రా పనులు అప్పగించకపోవడం.
-ఢిల్లీ తరహాలోనే ఛత్తీస్‌గఢ్ ప్రజందరికీ ఉచిత వైద్య చికిత్స
-మందులు, వైద్య పరీక్షలు, ఆపరేషన్లు ఉచితం.
-ప్రతి గ్రామం, వార్డులో మెహల్లా క్లినిక్‌లు
-ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు తెరవడం.
-రోడ్లు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత చికిత్స.
-ఢిల్లీ తరహాలోనే సీనియర్ సిటిజన్లకు వారు ఎంచుకున్న పుణ్య క్షేత్రాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
-పర్యటన సమయంలో ఉచిత బస, ఆహార సదుపాయం.
-ఢిల్లీ తరహాలోనే అవినీతికి తావులేకుండా చేయడం.
-ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోను చేసి పని చెప్పగానే, ఆ ప్రభుత్వ ఉద్యోగి నేరుగా ఇంటికే వచ్చి పని చేసి వెళ్తాడు. ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు.