Share News

Rahul KG to PG: కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-10-28T20:09:33+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిండర్ గార్డెన్‌ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.

Rahul KG to PG: కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య: రాహుల్ గాంధీ

రాయపూర్: ఉచిత విద్యతో పాటు సమాజంలోని వివిధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిండర్ గార్డెన్‌ (KG) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) వరకూ ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. నవంబర్ 7న తొలి విడత ఎన్నికల జరగనున్న 20 నియోజకవర్గాల్లో భానుప్రతాప్‌పూర్ ఉంది.


అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ ప్రోత్సాహన్ యోజన కింద బీడీ ఆకుల ధరను రూ.4,000కు పెంచుతామని, ఇతర మైనర్ ఫారెస్ట్ ఉత్పత్తుల కనీస మద్దతు ధర రూ.10 పెంచుతామని హామీ ఇచ్చారు. గిరిజన ఆధిపత్యం ఉన్న బస్తర్ ప్రాంతంలో బీడీ ఆకు పంట, సేకరణ ప్రజల ప్రధాన జీవినాధారంగా ఉంది.


కులగణనకు పీఎం ఎందుకు వెనకాడుతున్నారు?

కులగణన విషయంలో ప్రధానమంత్రి వైఖరిని కూడా రాహుల్ తన ప్రసంగంలో తప్పుపట్టారు. తన ప్రసంగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) గురించి మాట్లాడే ప్రధాని...కులగణన విషయంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారని నిలదీశారు. దేశంలో కులగణన నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఎంపిక చేసిన కొద్ది మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితులు, కార్మికులు, ఆదివాసాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గిరిజనులను ఆదివాసీలుగా పిలవడానికి బదులు వనవాసీలుగా బీజేపీ సంబోధించడం గిరిజన సంస్కృతి, చరిత్ర, భాషను అవమానపరచడమేనని విమర్శించారు.

Updated Date - 2023-10-28T20:09:33+05:30 IST