Chief Minister: టీచర్లకు పండగే పండగ..
ABN , First Publish Date - 2023-03-02T09:20:43+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) తన జన్మదిన వేడుకల సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక పథకాలను ప్రకటించారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) తన జన్మదిన వేడుకల సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక పథకాలను ప్రకటించారు. స్థానిక నుంగంబాక్కంలోని అన్బళగన్ విద్యా ప్రాంగణం (డీపీఐ)లో ఏర్పాటు చేసిన ప్రివ్యూ థియేటర్‌ను స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉన్నతాధికారులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యతలు కలిగిన ఉపాధ్యాయులకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) ఎల్లప్పుడు అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం పలు పథకాలను అముల చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ప్రతిభా పాటవాలను పెంపొందించుకునేందుకు వీలుగా గ్రాడ్యుయేట్ టీచర్లందరికీ ఉచిత ట్యాబ్(Free tab)లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇదే విధంగా ఉపాధ్యాయులందరికీ ప్రతి మూడేళ్లకొకమారు ఉచిత వైద్యపరీక్షలు (మాస్టర్ హెల్త్ చెకప్) నిర్వహించనున్నట్లు స్టాలిన్(Stalin) ప్రకటించారు. ఇదేవిధంగా ఉన్నత విద్యనభ్యసించే ఉపాధ్యాయుల పిల్లలకు ప్రభుత్వం అందించే విద్యారుణాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులను విదేశాలకు విహారయాత్రగా తీసుకెళ్లే పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు తాను ప్రకటించిన పథకాలను అమలు చేయడానికి రూ.225 కోట్ల మేరకు వ్యయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.