Chief Minister: సీఎం మండిపాటు.. మహిళా బిల్లుకు ఇంత జాప్యమెందుకో?
ABN , First Publish Date - 2023-09-21T09:16:18+05:30 IST
వ్యవసాయ చట్టాలు, ఉమ్మడి పౌరస్మృతి చట్టం, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చట్టం, అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించే
- ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎత్తుగడ
- ఇదో రకం మోసం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ చట్టాలు, ఉమ్మడి పౌరస్మృతి చట్టం, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చట్టం, అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాలను అమలుచేయడంలో అత్యుత్సాహం కనబరచిన కేంద్రప్రభుత్వం.. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికి ఎందుకింత జాప్యం చేసిందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఓ ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, మహిళలపై బీజేపీకి నిజంగా అభిమానం వుంటే అధికారంలోకి రాగానే ఆ పని చేసుండాల్సి ఉందన్నారు. అయితే త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఆ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ప్రభుత్వం 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకుంటోందన్నారు. 2016 మార్చి 8న ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో అఖిలపక్ష నేతలు మహిళా ఎంపీలతో కలిపి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారని, అయితే దీనిపై బీజేపీ పెద్దలు అప్పట్లో నోరు మెదపలేదన్నారు. ఏడేళ్ల అనంతరం ఇప్పుడు హడావిడిగా నోరు విప్పారన్నారు. దీంతో మహిళల సంక్షేమం కోసం ఈ బిల్లును తీసుకురాలేదని స్పష్టమవుతోందన్నారు. కులమత ఘర్షణలను రూపుమాపి నేటి నాగరిక ప్రపంచంలో అన్ని కులాలను గౌరవించాలని, ప్రజాస్వామ్యాన్ని పెంపొందింపజేయాలన్న లక్ష్యంతోనే డీఎంకే పని చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే చట్టసభల్లో మహిళలకు తగిన అవకాశం కూడా కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా కేంద్రప్రభుత్వం కూడా మహిళా హక్కులను కాలరాయకుండా పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 1996లోనే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. యూనియన్ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ తదితర సంస్థలకు జరిగిన ఎన్నికల్లో 1990వ సంవత్సరం చివరలో అధికారంలో వున్న డీఎంకే ప్రభుత్వం ఈ 33 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించిందన్నారు. ఆ తరువాత డీఎంకే ప్రభుత్వం గద్దె దిగిపోవడంతో, పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపకుండానే కాలం వెళ్లదీసిందన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. చెన్నై, తిరుచ్చి(Chennai, Trichy) తదితర ఆరు కార్పొరేషన్లలో మహిళలే మేయర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. తిరునల్వేలి కార్పొరేషన్ ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించామన్నారు.
అదేవిధంగా పార్లమెంటు, అసెంబ్లీలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తూనే ఉన్నారన్నారు. దాదాపు 27 సంవత్సరాలుగా పార్లమెంటులో మహిళా బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు పలుమార్లు ప్రయత్నాలు చేపట్టాయన్నారు. 2010 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అయితే రాజ్యసభలో తగిన బలం లేకపోవడంతో ఆ బిల్లు వీగిపోయిందన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ బిల్లును అటకెక్కించిందన్నారు. తొమ్మిదేళ్లుగా అత్యధిక మెజారిటీతో ఉన్న కేంద్రప్రభుత్వం.. మహిళా సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ బిల్లు కేవలం కంటి తుడుపు చర్యేనని, దేశంలో నెలకొన్న సమస్యలన్నింటినీ మరుగుపరిచేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని, అయినా మహిళా రిజర్వేషన్ బిల్లు కాబట్టి తాము స్వాగతిస్తున్నామన్నారు. అదే విధంగా ఈ బిల్లు ఆమోదానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బీసీ, ఎంబీసీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదని స్టాలిన్ సూచించారు.
దేవాదాయ మాజీ ఉద్యోగులకు పింఛన్ పెంపు
రాష్ట్ర హిందూ దేవాదాయశాఖ నిర్వహణలోని ఆలయాల్లో పని చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పంపిణీ చేస్తున్న రూ.3 వేల పింఛన్‌ను రాష్ట్రప్రభుత్వం రూ.4 వేలకు పెంచింది. సచివాలయంలో బుధవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పదిమందికి తలా రూ.4 వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకంతో 2,450 మంది మాజీ ఉద్యోగులు, 304 మంది కుటుంబ పింఛన్‌దారులు లబ్ధిపొందుతారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా తదితరులు కూడా పాల్గొన్నారు.